నిజాలు మాట్లాడే వ్యక్తిని లోక్‌సభ నుంచి తప్పించే ప్రయత్నం : కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించడంపై ఆ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి తొలగించాలని చూస్తుందని అన్నారు. గత కొంత కాలంగా ప్రభుత్వం కేంద్ర సంస్థలతో ప్రతిపక్ష నేతల గొంతును అణచివేసేందుకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా కేసును ఉన్నత కోర్టులో అప్పీల్ చేస్తామని తెలిపారు. నిజాలు మాట్లాడే వ్యక్తిని ఉద్దేశ్యపూర్వకంగానే తప్పించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. పరువు నష్టం దావా కేసులో ఏ వ్యక్తికి ఇంత కాలం శిక్ష పడదని అన్నారు.
కాంగ్రెస్ పోరాటం చేస్తుందని.. ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని చెప్పారు. మరోవైపు రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పరోక్షంగా మద్దతిస్తూ మాట్లాడారు. ఇందులో భయపడాల్సిన అవసరం ఏమి లేదని చెప్పారు. ‘మనమంతా శక్తితో కలిసికట్టుగా పోరాడాలి. ఇలాంటి చర్యలు మోడీ అలసటను చూపిస్తాయి. రాబోయే ఎన్నికల పట్ల ప్రధానికి విశ్వాసం లేదు. దేశంలో ఇలా ఎప్పుడు జరగలేదు. వారు ఇలాగే పదవిలో ఉంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంతమౌతుంది’ అని అన్నారు.