ఫేక్ న్యూస్‌ను గుర్తుపట్టేందుకు 5 చిట్కాలివీ

దిశ, నేషనల్ బ్యూరో : ఇది ఇంటర్నెట్ యుగం. ఇప్పుడు నిత్యం కోట్లాది మంది ఈ-పేపర్లు, న్యూస్ వెబ్ సైట్లలోని వార్తలను చదువుతున్నారు.

Update: 2024-03-25 11:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఇది ఇంటర్నెట్ యుగం. ఇప్పుడు నిత్యం కోట్లాది మంది ఈ-పేపర్లు, న్యూస్ వెబ్ సైట్లలోని వార్తలను చదువుతున్నారు. యూట్యూబ్ కంటెంట్‌ను చూసి కొత్తకొత్త అప్‌డేట్స్‌ను తెలుసుకుంటున్నారు. టీవీలు, న్యూస్ పేపర్ల స్థానాన్ని ఇప్పుడు ఇవే భర్తీ చేశాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) నకిలీ వార్తలను గుర్తించడానికి నెటిజన్లకు ఐదు టిప్స్‌ను సూచిస్తూ సోమవారం ఉదయం ఓ ట్వీట్ చేసింది. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1.సోర్స్‌ను చెక్ చేయండి

నెటిజన్లు ఏదైనా వార్తను చదివేటప్పుడు దాని సోర్స్‌ (వార్తా మూలం)ను చెక్ చేయాలి. సోర్స్ ఎంత నమ్మదగినదిగా ఉంటే.. ఆ వార్త విశ్వసనీయతా స్థాయి అంతమేర పెరుగుతుంది. వార్తను ఎలా సేకరించారు ? ఎక్కడి నుంచి సేకరించారు ? అనేది ఈ విషయంలో నెటిజన్ గుర్తించే ప్రయత్నం చేయాలి. ఈ సమాచారం ఆధారంగా వార్తలోని వాస్తవికతపై ఒక అంచనాకు రావచ్చు.

2.మొత్తం చదవండి

నెటిజన్లు కేవలం వార్త హెడ్ లైన్‌ను చూసి.. అదే నిజమని నమ్మకూడదు. వార్త చివరిదాకా చదివితేనే .. అందులో ఏం చెప్పారనే దానిపై క్లారిటీ వస్తుంది. వ్యూస్ కోసం కొన్ని వార్తల హెడ్ లైన్స్‌ను ఆకట్టుకునేలా పెడుతుంటారు. కానీ అలాంటి వార్తల లోపల విషయం మరొకటి ఉంటుంది. అందుకే వార్తను ఆసాంతం చదివాకే దానిపై ఒక నిర్ణయానికి రావాలి.

3.ధ్రువీకరణ చేసుకోండి

తగిన వివరణలు, అధికారిక ప్రకటనలతో ఉండే వార్త సమగ్రతను సంతరించుకుంటుంది. విశ్వసనీయమైన సంస్థలు, నిపుణులు, ప్రభుత్వ విభాగాలు, అధికారులను ప్రస్తావిస్తూ వార్త ఉంటే దానిపై నమ్మకాన్ని ఉంచొచ్చు. ఆ వార్తను ప్రచురించే ముందు కసరత్తు, తనిఖీ జరిగింది అనేందుకు ఈ అంశాలన్నీ ప్రామాణికాలు.

4.క్రాస్ చెక్ చేయండి

ఒక వెబ్‌సైట్‌లో ఓ వార్తను చదివామని అనుకోండి. దాన్ని నమ్మే ముందు.. అదే సమాచారంతో ఇతర వెబ్‌సైట్లలో వచ్చిన వార్తను తనిఖీ చేయండి. ఈ రెండు వార్తలలోని సమాచారం ఒకేలా ఉంటే.. న్యూస్ రిపోర్టింగ్‌లో విశ్వసనీయత ఉందని మనం భావించొచ్చు. వార్తను కూర్చేందుకు వినియోగించిన సోర్స్ కూడా బలంగా ఉందనేందుకు ఇది ప్రామాణికం.

5.నేరుగా షేర్ చేయొద్దు

బాధ్యతాయుతమైన నెటిజన్లుగా మనం చూసిన ప్రతీ వార్తను వెంటనే షేర్ చేయకూడదు. తొలుత ఆ వార్తలోని వాస్తవికతను నిర్ధారించుకోవాలి. అది నమ్మదగిన విధంగా ఉంటేనే షేర్ చేయాలి. పైన మనం చెప్పుకున్న అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ మనం షేర్ చేసేది ఫేక్ న్యూస్ అయితే.. అది వైరల్ అయిపోయి ప్రజలు తప్పుడు అవగాహనకు వస్తారు.

Tags:    

Similar News