రెండో దశ పోలింగ్.. Google ప్రత్యేక డూడుల్ ఇదే..!

లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. అయితే, లోక్ సభ ఎన్నికల సందర్భంగా గూగుల్ తన హోంపేజ్ లో ప్రత్యేక డూడుల్ ని ఏర్పాటు చేసింది.

Update: 2024-04-26 06:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. అయితే, లోక్ సభ ఎన్నికల సందర్భంగా గూగుల్ తన హోంపేజ్ లో ప్రత్యేక డూడల్ ని ఏర్పాటు చేసింది. ఓటర్లకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ప్రత్యేక డూడుల్ తో అందర్నీ ఆశ్చర్యపరిచింది గూగుల్. ఐకానిక్‌ లోగో ‘Google’ మధ్యలో ఉండే ‘o’ని ఇంక్‌ మార్క్‌తో ఉన్న చూపుడు వేలితో కూడిన చేతి గుర్తుతో నింపింది. ఇక ఈ డూడుల్ పై క్లిక్ చేస్తే ఎలక్షన్ కు సంబంధించిన వివరాలు వచ్చేలా దీన్ని రూపొందించింది గూగుల్.

లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ లో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. అందరూ ఓటు వేయాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా. యువకులు, మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని ప్రధాని మోడీ కోరారు. ఓటు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. బలమైన, సురక్షితమైన, సంపన్న దేశం కోసం ఓటు హక్కుని వాడుకోవాలన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రజాస్వామ్య ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు.

రెండో దశలో 1098 మంది పురుషులు, 102 మంది మహిళలు సహా మొత్తం 1202 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మంది మహిళా ఓటర్లు.. 5,929 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఓటేయనున్నారు. ఇకపోతే, 34.8 లక్షల మంది మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Tags:    

Similar News