అదానీ షేర్ల పతనంపై వివరాలు తెలపండి: సుప్రీంకోర్టు
అదానీ వివాదం నేపథ్యంలో మార్కెట్ పతనానికి గల కారణాలపై సోమవారంలోగా వివరాలు తెలియజేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం సెబీని ఆదేశించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ వివాదం నేపథ్యంలో మార్కెట్ పతనానికి గల కారణాలపై సోమవారంలోగా వివరాలు తెలియజేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం సెబీని ఆదేశించింది. అదానీ గ్రూప్‌పై వచ్చిన మోసం ఆరోపణల పతనాన్ని పరిశీలించేందుకు న్యాయమూర్తితో సహా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదికపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
హిండెన్‌బర్గ్ పరిశోధన నివేదిక ప్రచురించిన తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరల పతనం కారణంగా భారతీయ పెట్టుబడిదారులు అనేక లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, సెబీ నుండి సూచనలు తీసుకున్న తర్వాత నోట్‌ను సిద్ధం చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ధర్మాసనం తెలిపింది. భవిష్యత్తులో భారతీయ పెట్టుబడిదారులకు రక్షణ కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాల్సిందిగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)ని కోర్టు కోరింది. తదుపరి విచారణను సోమవారం చేపడతామని తెలిపింది.