ఎయిర్ ఇండియాను మూసేయండి: గులాం నబీ ఆజాద్
విమానాల ఆకస్మిక రద్దుతో ఇబ్బందిపడ్డ ప్రయాణీకుల్లో జమ్మూ కశ్మీర్ డీపీఏపీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్లు, సిబ్బంది సామూహికంగా అనారోగ్య కారణంతో సెలవు పెట్టడంతో దాదాపు 80కి పైగా విమానాల సర్వీసులు రద్దయ్యాయి. విమానాల ఆకస్మిక రద్దుతో ఇబ్బందిపడ్డ ప్రయాణీకుల్లో జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, డీపీఏపీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. దీంతో ఆయన ఎయిర్ఇండియా వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఎయిర్ఇండియాను మూసేయాలని డిమాండ్ చేశారు. బుధవారం గులాం నబీ ఆజాద్ ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లాల్సి ఉండగా, ఆయన ఎక్కాల్సిన విమానం కూడా రద్దయింది. దీనివల్ల ఆయన ఢిల్లీ విమానాశ్రయంలోనే దాదాపు 4 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. విమానాలు రద్దయ్యే విషయాన్ని ప్రయాణీకులకు ముందుగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. 'తాను పౌర విమానయాన మంత్రిగా ఉన్న సమయంలో ఎయిర్ఇండియా పైలట్లు 40 రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు. అప్పుడే తాము ప్రైవేట్ విమానయాన సంస్థలను తీసుకొచ్చాం. కానీ ఎయిర్ఇండియా గుణపాఠం నేర్చుకోలేదని' ఆజాద్ పేర్కొన్నారు.