కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ, యూఎస్ స్పందన: భారత ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా, జర్మనీ, ఐక్యరాజ్యసమితి స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ స్పందించారు.

Update: 2024-03-30 04:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా, జర్మనీ, ఐక్యరాజ్యసమితి స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ స్పందించారు. భారత్‌లో బలమైన న్యాయవ్యవస్థ ఉందని.. ఎవరి నుంచీ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్‌లో పటిష్ట న్యాయవ్యవస్థ అమలులో ఉందన్నారు. ఏ వ్యక్తితోనూ రాజీపడబోదని, చట్టం ముందు అందరూ సమానులేనని తెలిపారు. చట్టానికి అతీతులమని భావించిన వారు జవాబుదారీగా ఉంటారన్నారు. మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించే ఇండియా కూటమి నిరసనపై స్పందిస్తూ..చట్టం తన పని తాను చేయడం ప్రారంభించిన వెంటనే కొంతమంది వీధుల్లోకి వస్తారని ఎద్దేవా చేశారు. మానవహక్కులపై దాడి జరగుతోందని మొత్తుకుంటారని తెలిపారు.

‘ఎన్నికల టైంలో అవినీతి పరులపై చర్యలు తీసుకోవద్దనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది సరైందేనా? దోషులను శిక్షించడానికి ప్రత్యేక సీజన్ ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. అవినీతి కారణంగా కాంట్రాక్టులు లభించడం లేదని ఇప్పడు అది జైలుకు వెళ్లే మార్గంగా తయారైందని చెప్పారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 21న కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. దీంతో తొలిసారిగా జర్మనీ, ఆ తర్వాత అమెరికా, ఐక్యరాజ్యసమితిలు స్పందించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News