Dehradun: సేవ్ ఎన్విరాన్ మెంట్ 2.0 పేరుతో చెట్ల శవయాత్ర
అభివృద్ధి పనుల కోసం చెట్లను నరికివేయడంపై పర్యావరణవేత్తలు, మేధావులు వినూత్న నిరసన చేపట్టారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో సేవ్ ఎన్విరాన్ మెంట్ 2.0('Save Environment Movement 2.0) లో భాగంగా చెట్ల శవయాత్ర(tree funeral procession) నిర్వహించారు.
దిశ, నేషనల్ బ్యూరో: అభివృద్ధి పనుల కోసం చెట్లను నరికివేయడంపై పర్యావరణవేత్తలు, మేధావులు వినూత్న నిరసన చేపట్టారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో సేవ్ ఎన్విరాన్ మెంట్ 2.0('Save Environment Movement 2.0) లో భాగంగా చెట్ల శవయాత్ర(tree funeral procession) నిర్వహించారు. ఇప్పటి వరకు నరికిన చెట్లకు, త్వరలో నరికివేయనున్న చెట్లకు నివాళి అర్పించారు. తెల్లటి దుస్తులు ధరించి, నోటికి నల్లటి బ్యాండ్‌లు కట్టుకుని నరికిన చెట్ల కొమ్మలతో సచివాలయం వరకు అంత్యక్రియల ఊరేగింపు నిర్వహించారు. అయితే మార్గమధ్యలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ చెట్లను రెండేళ్ల క్రితం సహస్రధర రోడ్డు నుండి తరలించిన తర్వాత రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం సమీపంలోని ప్రాంతంలో తిరిగి నాటారు. అయితే, అక్కడికి తరలించినప్పట్నుంచి ఆ చెట్లు ఎప్పుడూ వికసించలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
తొలిసారిగా నరికిన చెట్లకు అంత్యక్రియలు
మరోవైపు, రిషికేశ్-డెహ్రాడూన్ రహదారిని విస్తరించేందుకు 3,000కు పైగా చెట్లను నరికేందుకు ప్రతిపాదించారు. ఇప్పటికే వందలాది చెట్లను నరికివేశారు. అయితే, అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేయడాన్ని నిషేధించాలని ప్రముఖ సామాజిక కార్యకర్త అనూప్ నౌటియాల్ డిమాండ్ చేశారు. 51 ఏళ్ల కిందట చిప్కో ఉద్యమం ఉత్తరాఖండ్‌లో ప్రారంభమైందని గుర్తు చేశారు. ఇప్పుడు దేశ చరిత్రలో తొలిసారిగా డెహ్రాడూన్‌లో నరికిన చెట్లకు అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. తమ నిరసన దేశమంతటా పర్యావరణంపై అవగాహన రేకెత్తిస్తుందని అన్నారు.