మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు మరో షాక్.. నాల్గవ కేసు నమోదు

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు మరో షాక్ తగిలింది

Update: 2024-06-25 13:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు మరో షాక్ తగిలింది. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు అయింది. ఇప్పటికే ఆయనపై మూడు కేసులు నమోదు కాగా, వీటిని దర్యాప్తును చేస్తున్న కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ప్రజ్వల్‌పై నాల్గవ కేసు నమోదు చేసింది. గతంలో ఉన్న మూడు కేసులలో కూడా లైంగిక వేధింపులు, వేధింపులు, నేరపూరిత బెదిరింపులు ఉండగా ఇప్పుడు కొత్త కేసులో బాధితుల ఫొటోలను రహస్యంగా రికార్డ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం వంటి సెక్షన్ల కింద నమోదు చేశారు. అయితే ఈ నాల్గవ ఎఫ్‌‌ఐఆర్‌లో ప్రజ్వల్ కాకుండా మరో ముగ్గురు వ్యక్తుల పేర్లు ఉన్నాయి, వీరిలో హసన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ్ ఉన్నారు.

వీడియో కాల్‌లో బాధితురాలిని లైంగికంగా వేధించిన సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ రికార్డ్ చేసిన ఫొటోలను ప్రీతం గౌడ, కిరణ్, శరత్‌లు పంచుకున్నారని బాధితురాలు ఆరోపించింది. క్లిప్‌ను ఇతరులకు షేర్ చేయడం వల్ల తన కుటుంబమంతా ఇబ్బంది పడిందని, తమ పరువు పోయందని తన ఫిర్యాదులో పేర్కొంది. నాల్గవ ఎఫ్ఐఆర్ IPC సెక్షన్లు 354(A), 354(D), 354(B), 506, 66 E ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేశారు. మూడు లైంగిక వేధింపుల కేసుల్లో ప్రజ్వల్ రేవణ్ణపై 21 రోజుల పాటు కస్టడీ విచారణ జరిపిన సిట్, ఇప్పుడు నాలుగో కేసును విచారించేందుకు కస్టడీని కోరింది.


Similar News