Hezbollah: అర్జెంటీనాలో దాడులకు హెజ్ బొల్లానే కారణమా..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్ బొల్లాపై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. కాగా.. ఇలాంటి టైంలో అర్జెంటీనా సంచలన ఆరోపణలు చేసింది.

Update: 2024-10-27 10:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్ బొల్లాపై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. కాగా.. ఇలాంటి టైంలో అర్జెంటీనా సంచలన ఆరోపణలు చేసింది. 1992లో తమ రాజధానిలో ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం, 1994లో యూదు కమ్యూనిటీపై జరిగిన దాడులకు హెజ్‌బొల్లానే ప్రధాన కారణమని ప్రకటించింది. అప్పటిదాడుల సూత్రధారి అహ్మద్ కరాకీ హెజ్ బొల్లాకు చెందిన వ్యక్తి అని తెలిపింది. ఈ విషయాన్ని అర్జెంటీనా రక్షణశాఖ ప్రతినిధి ప్యాట్రిసియా బ్రులిచ్‌ లాటిన్‌ వెల్లడించారు. దానికి సంబంధించిన ఆధారాలను సైతం బయటపెట్టారు. ‘అర్జెంటీనాలో గతంలో జరిగిన బాంబు దాడులను గురించి మా ప్రజలు తెలుసుకోవాలి. ఆ దాడులకు ప్రధాన సూత్రధారి అమెరికాలో హెజ్‌బొల్లా కార్యకలాపాలకు అధిపతిగా పేరొందిన కరాకి. బ్రెజిల్‌లోని డ్రగ్స్ ముఠాలతో ఆ సంస్థకు చాలా సంబంధాలున్నాయి. అతిపెద్ద డ్రగ్‌ ముఠాలైన అయిన పీసీసీ, సీవీలతో కలిసి వ్యాపారాన్ని విస్తరించింది. అంతేకాదు.. వాటిని ఉగ్ర కార్యకలాపాల్లోకీ లాగింది. అలా సంపాదించిన సొమ్ముతో ఆయుధాలు కొని ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. దక్షిణ అమెరికా నుంచి ఈ ముఠాలు బోట్లపై కొకైన్‌తో మధ్య అట్లాంటిక్‌ ప్రాంతానికి చేరతాయి. మరోవైపు ఇటలీ, బాల్కన్‌ ప్రాంతాల నుంచి గ్యాంగ్‌లు డ్రగ్స్ ని తీసుకుని అక్కడి వెళ్తాయి. సరకును పరస్పరం మార్పిడి చేసుకొని తిరిగి తమ ప్రదేశాలకు చేరుకొని వ్యాపారం చేస్తారు’ అని బ్రులిచ్‌ వెల్లడించారు.

ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయంపై దాడి

ఇకపోతే, 1992లో అర్జెంటీనాలోని ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయంపై జరిగిన బాంబు దాడిలో 29 మంది మృతి చెందారు. 240 మందికి పైగా గాయపడ్డారు. ఆ తర్వాత రెండేళ్లకు యూదు కమ్యూనిటీలపై జరిగిన దాడిలో 86 మంది ప్రాణాలు చనిపోయారు. మరో, 300 మందికి గాయాలయ్యాయి. అయితే, ఈ దాడుల వెనుక ఇరాన్‌ హస్తం ఉన్నట్లు చాలా కాలం అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా, అర్జెంటీనాలో హెజ్‌బొల్లా కార్యకలాపాలకు ఇరాన్‌ మద్దతు ఇస్తోందని బ్రులిచ్‌ ఆరోపించారు.


Similar News