ఈ పోరాటంలో ఆదే నా ఆయుధం: రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి ఊరట లభించింది.
దిశ, వెబ్‌డెస్క్: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సూరత్ సెషన్స్ కోర్టు ఈ కేసులో రాహుల్ గాంధీకి ఈ నెల 13వ తేదీ వరకు బెయిల్ పొడగించింది. పరువు నష్టం కేసులో సూరత్ మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చడంతో పాటు.. రెండేళ్ల జైలు శిక్ష విధించడాన్ని ఆయన సూరత్ సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు.
ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఇవాళ విచారించిన సూరత్ సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీకి ఈ నెల 13వ తేదీ వరకు బెయిల్ పొడగిస్తూ.. ఈ కేసు తదుపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. కోర్టు తీర్పు అనంతరం ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటమని.. ఈ పోరాటంలో సత్యమే నా ఆయుధమని పేర్కొన్నారు. సత్యమే నా సంకల్పమంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఇక, సూరత్ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసేందుకు స్వయంగా రాహుల్ గాంధీ రావడంతో ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున సూరత్ సెషన్స్ కోర్టు వద్దకు వెళ్లారు.