ఒక్క ముస్లిం ఓటు కూడా మాకొద్దు: మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో బీజేపీ నేత, మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో శివమొగ్గ నుండి ఒక్క ముస్లిం ఓటు కూడా బీజేపీకి అవసరం లేదని అన్నారు. జాతీయవాద ముస్లింల ఓట్లు మాత్రం బీజేపీకే పడతాయని చెప్పారు.
సోమవారం శివమొగ్గలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరశైవ-లింగాయత్ సమావేశంలో మాజీ మంత్రి ఈశ్వరప్ప, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈశ్వరప్ప మాట్లాడుతూ.. ప్రజలు అభివృద్ధికి సంబంధించిన సమస్యలను లేవనెత్తడమే కాకుండా మతమార్పిడుల పట్ల ఆందోళన చెందాలని ఈశ్వరప్ప అన్నారు.
‘శివమొగ్గ నియోజకవర్గంలో 50,000 నుండి 55,000 (ముస్లిం) ఓటర్లు ఉన్నారు. మాకు ఒక్క ముస్లిం ఓటు కూడా అవసరం లేదని మీకు సూటిగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ముస్లింలకు ఆరోగ్యం, విద్యా సమస్యలు ఉన్నప్పుడు తాము వారికి చాలా సహాయం చేశాం. అలాంటి ముస్లింలు మాకు ఓటు వేస్తారు అని ఈశ్వరప్ప అన్నారు. అంతేకాకుండా, యడియూరప్ప నిజమైన హిందువు అని, హిందువులకు ఆయన ఒక మోడల్ అని కొనియాడారు.
బీజేపీతోనే హిందువులకు భద్రత అని తనతో చాలా మంది చెప్పారని అన్నారు. ముస్లిం ఓట్లను పొందేందుకు ప్రతిపక్షాలు హిందువులు, ముస్లింలను విడదీస్తున్నాయని ఈశ్వరప్ప అన్నారు. హిందువులను తక్కువ, ముస్లింలను ఉన్నతంగా మార్చడాన్ని తాము అనుమతించబోమన్నారు. కానీ, కొందరు జాతీయవాద ముస్లింలు కచ్చితంగా బీజేపీకి ఓటేస్తారని వ్యాఖ్యానించారు. హిందువులను కులం పేరుతో విభజించడంలో అందరూ విఫలమయ్యారని చెప్పుకొచ్చారు.