పాక్‌కు బ్రహ్మోస్ క్షిపణి సమాచారాన్ని అందించిన కేసులో మాజీ ఇంజనీర్‌కు జీవిత ఖైదు

పాక్ ఐఎస్ఐకి భారత్‌కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి సున్నితమైన సమాచారాన్ని అందించాడనే కేసులో బ్రహ్మోస్ ఏరోస్పేస్ మాజీ ఇంజనీర్‌ నిశాంత్ అగర్వాల్‌కు నాగపూర్ జిల్లా కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది

Update: 2024-06-03 10:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఐఎస్ఐకి భారత్‌కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి సున్నితమైన సమాచారాన్ని అందించాడనే కేసులో బ్రహ్మోస్ ఏరోస్పేస్ మాజీ ఇంజనీర్‌ నిశాంత్ అగర్వాల్‌కు నాగపూర్ జిల్లా కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. అలాగే, 14 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష, రూ.3,000 జరిమానా కూడా విధించింది. ఐటి చట్టంలోని సెక్షన్ 66 (ఎఫ్), అధికారిక రహస్యాల చట్టం (ఓఎస్‌ఎ)లోని వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 235 ప్రకారం అగర్వాల్‌ను దోషిగా నిర్ధారించినట్లు అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎంవి దేశ్‌పాండే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అగర్వాల్ బ్రహ్మోస్‌లో దాదాపు నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. అయితే ఆ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కి బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అతను లీక్ చేశాడు. నాగ్‌పూర్‌లోని కంపెనీ క్షిపణి కేంద్రంలో సాంకేతిక పరిశోధన విభాగంలో ఉద్యోగం చేస్తున్న అగర్వాల్‌ను 2018లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ (ATS) సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేశారు. ఈ కేసులో అగర్వాల్‌కు గత ఏప్రిల్‌లో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు అతని నాగపూర్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.

భారత్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ క్షిపణి గురించిన సమాచారాన్ని పాక్‌కు చేరవేయడంతో 2018లో ఈ కేసు సంచలనం సృష్టించింది. నేహా శర్మ, పూజా రంజన్ అనే రెండు అనుమానిత పాకిస్థాన్ ఫేస్‌బుక్ ఖాతాల ద్వారా అగర్వాల్ ఆ దేశ ఇంటెలిజెన్స్‌తో టచ్‌లో ఉన్నాడు. ఇస్లామాబాద్‌లో ఉన్న ఈ ఖాతాలను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ నడుపుతున్నట్లు తెలిసింది. ఈ కేసు నమోదు కాక ముందు నిశాంత్ అగర్వాల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డు సైతం గెలుచుకున్నాడు


Similar News