Freebies : ఉచితాలు ఇంకెంత కాలం ఇస్తారు ?.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
దిశ, నేషనల్ బ్యూరో : ‘‘ఉచితాలు(Freebies) ఇంకెంత కాలం ఇస్తారు ?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) ప్రశ్నించింది.
దిశ, నేషనల్ బ్యూరో : ‘‘ఉచితాలు(Freebies) ఇంకెంత కాలం ఇస్తారు ?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) ప్రశ్నించింది. వలస కార్మికులకు ఉచితాలు ఇచ్చే బదులుగా.. వారికి ఉపాధిని కల్పించడం(Job Opportunities), వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచడంపై ప్రభుత్వం ఫోకస్ చేస్తే బాగుంటుందని సూచించింది. కరోనా సంక్షోభ సమయంలో వివిధ రాష్ట్రాల్లో వలస కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్న అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటో కేసుగా విచారణకు స్వీకరించింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం దీన్ని విచారించింది. ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. ‘ఈ-శ్రమ్’ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న వలస కార్మికులకు ఉచిత రేషన్ అందించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం ఎంతమందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ.. ‘‘దేశవ్యాప్తంగా 81 కోట్ల మందికిపైగా ప్రజలు ఉచిత/సబ్సిడీ రేషన్‌ను పొందుతున్నారు’’ అని తెలిపారు. ఈ సమాధానం విని ఆశ్చర్యపోయిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ‘ఇక ట్యాక్స్ చెల్లించే వాళ్లు మాత్రమే ఉచిత రేషన్ తీసుకోకుండా మిగిలిపోయి ఉంటారు కదా’’ అని వ్యాఖ్యానించింది.
ప్రశాంత్ భూషణ్ వర్సెస్ తుషార్ మెహతా..
‘‘ఇంకెంత కాలం పాటు ఉచితాలు ఇస్తూ పోతారు. వాటికి బదులుగా వలస కార్మికులకు ఉపాధి అవకాశాలను పెంచండి. వారి ప్రొఫెషనల్ నైపుణ్యాలను పెంచండి. సొంతకాళ్లపై నిలబడేలా తీర్చిదిద్దండి. ప్రజలను సంతోషపెట్టేందుకు రాష్ట్రాలు రేషన్ కార్డులు మంజూరు చేస్తుంటాయి. దానివల్ల భారీ భారం పడేది మాత్రం కేంద్రంపైనే కదా’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈక్రమంలో అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మధ్య వాడివేడిగా వాదనలు కొనసాగాయి. ‘‘దేశంలో జనగణన 2021లో జరిగింది. అయితేే కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల సంఖ్య కోసం ఇప్పటికీ 2011 సెన్సస్‌పైనే ఆధారపడుతోంది. వాస్తవానికి 2021 నాటికి వలస కార్మికుల సంఖ్య బాగా పెరిగింది’’ అని అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ తెలిపారు. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కౌంటర్ ఇస్తూ.. ‘‘కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొవిడ్ టైంలో వలస కార్మికుల కోసం ఏమీ చేయలేదు. అలాంటి సంస్థలే కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నాయి’’ అని విమర్శించారు.పరోక్షంగా అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్‌కు చెందిన క్లయింట్‌ను(ఒక స్వచ్ఛంద సంస్థ) ఉద్దేశించి తుషార్ మెహతా ఈ కామెంట్ చేశారు. దీంతో తుషార్ మెహతా, ప్రశాంత్ భూషణ్‌లను న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శాంతింపజేశారు. దీనిపై తదుపరి విచారణను జనవరి 8కి వాయిదా వేశారు.