FM Sitharaman's record: వరుసగా ఏడోసారి.. అరుదైన రికార్డు

కేంద్ర ఆర్థికమంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman)లోక్ సభలో బడ్జెట్ ను సమర్పించారు.

Update: 2024-07-23 10:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ఆర్థికమంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman)లోక్ సభలో బడ్జెట్ ను సమర్పించారు. కాగా.. ఈసారి బడ్జెట్(Budget) ప్రవేశపెట్టడంతో నిర్మలమ్మ అరుదైన రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు వరుసగా 6 సార్లు బడ్జెట్ సమర్పించిన ఆమె.. ప్రస్తుతం ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్రలో తన పేరుని లిఖించకున్నారు. వరుసగా ఏడు సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన భారత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా ఆమె నిలిచారు. ఈ క్రమంలోనే ఆమె మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌ని దాటేశారు. ఈయన రికార్డు స్థాయిలో మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ.. వరుసగా 6 సార్లు మాత్రమే పద్దును పార్లమెంటులో సమర్పించారు. దీంతో ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఆయనను అధిగమించారు. గతంలో భారత మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సహా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే వరుసగా ఆయన 6 సార్లు, మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం

ఇక 2019లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) నేతృత్వంలో ఎన్డీఏ కూటమి(NDA) వరుసగా రెండో సారి అధికారం చేపట్టగా.. భారత మొట్టమొదటి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి వరుసగా 6 సార్లు ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో 2024 మధ్యంతర బడ్జెట్ కూడా ఉంది. ఇకపోతే, సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం కూడా నిర్మల సీతారామన్ పేరుతోనే ఉంది. 2020 బడ్జెట్ సమయంలో ఏకంగా 2 గంటల 40 నిమిషాల సేపు మాట్లాడారు. ఈ రికార్డు కూడా ఇప్పటికీ అలాగే ఉంది.


Similar News