Cyclone Dana: ఒడిశాలో ‘దానా’ బీభత్సం.. 35 లక్షల మందిపై ప్రభావం
ఒడిశాలో దానా తుపాన్ బీభత్సం సృష్టించింది.14 జిల్లాల్లో 35.95 లక్షల మంది ప్రజలు ప్రభావితమైనట్టు మంత్రి పూజారి తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో ఇటీవల సంభవించిన దానా తుపాన్ (Cyclone Dana) బీభత్సం సృష్టించింది. తుపాన్ కారణంగా 14 జిల్లాల్లో భారీ వరదలు పోటెత్తగా 35.95 లక్షల మంది ప్రజలు ప్రభావితమైనట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేశ్ పూజారి (Suresh pujari) తెలిపారు. 6,210 సహాయక శిబిరాలకు 8,10,896 మందిని తరలించినట్టు వెల్లడించారు. అత్యధికంగా దెబ్బతిన్న జిల్లాల్లో కేంద్రపారా(kendra para), బాలాసోర్(balasore), భద్రక్ (Bhadrak) ఉన్నాయి. అయితే తుపాన్ వల్ల ప్రాణనష్టం ఏమీ జరగలేదు. పంట నష్టం మాత్రం భారీగా జరిగి ఉంటుందని అంచనా వేస్తు్న్నారు. సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి ఆహారం, ఇతర అవసరమైన వస్తువులను అధికారులు అందజేస్తున్నట్టు మంత్రి సురేశ్ తెలిపారు.
దెబ్బతిన్న 5,840 ఇళ్లు
తుపాన్, ఆ తర్వాత వచ్చిన వరదల కారణంగా దాదాపు 5,840 ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయని పూజారి తెలిపారు. విపత్తులో ఇళ్లు కోల్పోయిన వారికి పాలిథిన్ షీట్లు అందజేస్తున్నామన్నారు. విపత్తు సంభవించినప్పుడల్లా ప్రజలు తమ ఇళ్లు కోల్పోతారని, వారికి నష్టపరిహారం అందజేస్తామన్నారు. ఈసారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి ప్రజలకు దశలవారీగా శాశ్వత ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలోని తుపాన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న కచ్చా గృహాల సర్వేను కూడా నిర్వహించాలని ఒడిశా ప్రభుత్వం యోచిస్తోంది.