కొత్త ఎలక్షన్ కమిషనర్లు వీరేనా? ఈడీ, ఎన్ఐఏ నుంచి సెలక్ట్ చేయనున్న కేంద్రం! రెండు రోజుల్లో ప్రకటన..

ఐదుగురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Update: 2024-03-12 19:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే వారం విడుదలవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ముగ్గురు సభ్యులు ఉండాల్సిన కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ అనూహ్య రాజీనామా, అంతకన్నాముందే ఫిబ్రవరి 14న మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండే(65) రిటైరవ్వడంతో ఇప్పుడు ఈసీలో రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న రెండు స్థానాలను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 15లోగా వాటిని భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆధ్వర్యంలో సెర్చ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ సెక్రటరీ, సిబ్బంది శాఖ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రెండు ప్యానళ్లుగా విడిపోయి చెరో ఐదుగురి పేర్లను రెండు పోస్టులకు ప్రతిపాదిస్తారు. ఈ రెండు లిస్టులను ఆయా ప్యానళ్లు సెర్చ్ కమిటీకి సమర్పిస్తాయి. అనంతరం ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక కేంద్ర మంత్రి, లోక్‌సభలో విపక్ష నేతతో కూడిన ఎంపిక కమిటీ మొత్తం పది మంది పేర్లను పరిశీలించి.. వారిలో ఇద్దరి పేర్లను ఎన్నికల కమిషనర్ పోస్టులకు ఖరారు చేస్తుంది. బుధ లేదా గురువారాల్లో ప్రధాని సారథ్యంలోని ఎంపిక కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నూతన ఎన్నికల కమిషనర్లుగా ఎవరిని నియమిస్తారనే చర్చ రాజకీయవర్గాల్లో జోరందుకుంది. ఇందుకు సంబంధించిఇప్పటికే కొన్ని పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.

పోటీలో ఆ ఐదుగురు

వీరిలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మాజీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా (రిటైర్డ్ ఐఆర్ఎస్ ఐటీ: 1984), కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మాజీ చీఫ్ పీసీ మోడీ (రిటైర్డ్ ఐఆర్ఎస్ ఐటీ: 1982), జేబీ మోహపాత్ర (రిటైర్డ్ ఐఆర్ఎస్ ఐటీ ఎల్: 1985) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరో ఒక్కరినైనా నియమించే అవకాశముందని తెలుస్తోంది. వీరి తర్వాత ఎన్ఐఏ ప్రస్తుత చీఫ్ దినకర్ గుప్తా (ఐపీఎస్: 1986 పంజాబ్ కేడర్), రాధా ఎస్.చౌహాన్ (ఐఏఎస్: 1988 యూపీ) సహా ఇటీవల పదవీ విరమణ చేసిన, మరికొద్ది నెలల్లో పదవీవిరమణ చేయనున్న మరికొంత మంది ఐఏఎస్ అధికారుల పేర్లు కూడా ఎన్నికల కమిషర్‌ పదవికి పరిశీలనలో ఉన్నాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. మొత్తంగా సుమారు 32 మంది అధికారులు కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

Tags:    

Similar News