Rahul Gandhi: కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టుపై ఎఫ్ఐఆర్
ఢిల్లీలో కేంద్ర మంత్రి నివాసంతో పాటు ఆయన కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టుపై బెంగళూరులో కేసు నమోదైంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు గురువారం ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారతీయుడు కాదని, నంబర్ వన్ ఉగ్రవాదిని అనే అవార్డు ఇవ్వాలంటే అది కాంగ్రెస్ నేతకే దక్కాలని రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న రవ్‌నీత్ సింగ్ బిట్టు ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై భగ్గుమన్న కాంగ్రెస్ వర్గాలు బెంగళూరులోని హైగ్రౌడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. ఢిల్లీలో కేంద్ర మంత్రి నివాసంతో పాటు ఆయన కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రవ్‌నీత్ సింగ్ బిట్టు రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఎక్కువ సమయం విదేశాల్లోనే గడిపాడని, అతని దేశాన్ని ప్రేమించడని, వేరే దేశాలకు వెళ్లినప్పుడు అన్నీ తప్పుగా మాట్లాడుతాదని అన్నారు.