Jammu&Kashmir: జమ్ము-కశ్మీర్ లో నేడు మలివిడత పోలింగ్.. 7 జిల్లాల్లో ఎన్నికలు

జమ్ము కశ్మీర్ లో తుదివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. జమ్ములో 24, కశ్మీర్ లోయలో 16 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. బరిలో 415 మంది అభ్యర్థులు ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలివి.

Update: 2024-10-01 02:18 GMT

దిశ, వెబ్ డెస్క్ : జమ్ము-కశ్మీర్ లో నేడు మలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జమ్ముతో కలిపి మొత్తం 7 జిల్లాల్లో 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 415 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలువగా.. వీరిలో మాజీ డిప్యూటీ సీఎంలు తారా చంద్, ముజఫర్ బేగ్ లు ఉన్నారు. 39.18 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కశ్మీర్ లోయలోని బారాముల్లా, ఉరి, రఫియాబాద్, పఠాన్, గుల్ మార్గ్, సోపోర్, కుప్వారా, కర్ణా, త్రెహ్గం, హంద్వారా, లోలాబ్, లాంగేట్, బందిపొరా, సోనావరి, గురేజ్, వగూరా క్రీరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ భద్రత నడుమ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. జమ్ములో 24 ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి. ఈ ఎన్నికల్లో వెస్ట్ పాకిస్థాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్భా తెగలకు చెందినవారు ఓటు వేయనున్నారు. 5,060 పోలింగ్ కేంద్రాల్లో 20 వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు.

జమ్ము-కశ్మీర్ లో మలివిడత ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ X వేదికగా ట్వీట్ చేశారు. పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని కోరారు. అలాగే తొలిసారి ఓటు వేసే యువతతో పాటు మహిళలు కూడా పెద్దఎత్తున ఓటు వేసేందుకు తరలి వెళ్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. 


Similar News