New Parliament Building Inauguration :భారత నూతన పార్లమెంట్ ప్రత్యేకతలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో ప్రధానితో పాటు స్పీకర్ ఓంబిర్లా పాల్గొన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో ప్రధానితో పాటు స్పీకర్ ఓంబిర్లా పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సెంగోల్‌కు సాష్టాంగా నమస్కారం చేసి, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కుర్చీ వద్ద ప్రతిష్టించారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ ప్రారంభం వేళ.. నిర్మాణ ప్రత్యేకతలపై నెట్టింట్లో ఆసక్తకిర చర్చ జరుగుతోంది. ఆ ప్రత్యేకతలేంటో ఒకసారి తెలుసుకుందాం..
10 డిసెంబర్ 2020న కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. గుజరాత్‌కు చెందిన హెచ్సీపీ సంస్థ ఈ కొత్త భవనాన్ని డిజైన్ చేసింది. లోక్ సభ ఛాంబర్‌లో 888 మంది, రాజ్యసభ ఛాంబర్‌లో 384 మంది సభ్యులు, లోక్ సభ హాల్‌లో 1,272 మంది సభ్యులు కూర్చునేలా నిర్మాణం చేశారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించిన ఈ కొత్త భవనంలో విశాలమైన కాన్ స్టిట్యూషన్ హాల్, పార్లమెంటు సభ్యుల కోసం లాంజ్, లైబ్రరీ, కేఫ్, డైనింగ్ ఏరియా, కమిటీ మీటింగ్ రూమ్స్, పెద్ద పార్కింగ్ ఏరియాతో పాటు వీఐపీ లాంజ్ ఉన్నాయి.
ఈ పార్లమెంటు భవనం వైశాల్యం 64,500 చదరపు మీటర్లు. ఈ భవనానికి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్ కర్మ ద్వార్ అనే మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వీఐపీలు, ఎంపీలు, సందర్శకుల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. కొత్త పార్లమెంటు భవనంలోకి దివ్యాంగులు వెళ్లడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మంత్రిమండలి ఉపయోగం కోసం సుమారు 92 గదులు కేటాయించారు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రిని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించారు.
రూ.861.90 కోట్ల వ్యయంతో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించే బిడ్‌ను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దక్కించుకుంది. అయితే 2020లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కొత్త భవన నిర్మాణానికి అంచనా వ్యయం రూ.971 కోట్లు అని పార్లమెంటుకు తెలిపారు. కానీ, ప్రస్తుతం కొత్త పార్లమెంటు భవనం వ్యయం రూ.1,200 కోట్లకు పైగా పెరిగినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.