‘భారత్ పరువు తీయడానికే నకిలీ సిరప్‌లు’
ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలపై సుధీర్ పాఠక్ రియాక్ట్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో తయారవుతున్న గుయిఫెనెసిన్ దగ్గు సిరఫ్ కలుషిత పదార్థాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలపై ఆ ప్రొడక్ట్ ఉత్పత్తి చేస్తున్న క్యూపీ ఫార్మా లిమిటెడ్ (పంజాబ్) మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ పాఠక్ రియాక్ట్ అయ్యారు. భారత దేశం పరువు తీయడానికి ఎవరో దగ్గు సిరప్‌ను నకిలీ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కంబోడియాకు పంపిన దగ్గు సిరప్ ఎవరైనా నకిలీ చేసి దానిని మార్షల్ ఐలాండ్స్ మరియు మైక్రోనేషియాలో విక్రయించి భారత ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేశారని పంజాబ్‌కు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) అనుమానిస్తోందని సుధీర్ పాఠక్ అన్నారు.
కంబోడియాకు పంపిన దగ్గు సిరప్ నమూనాలను పరీక్ష కోసం ఎఫ్‌డిఎ విభాగం తీసుకుందని మొత్తం 18,336 బాటిళ్ల దగ్గు సిరప్‌ను తనిఖీల నిమిత్తం పంపించామని పాఠక్ తెలిపారు. కాగా డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం గుయిఫెనెసిన్ సిరప్ టీజీలో డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ ఆనవాళ్లు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పేర్కొంది. ఇవి మానవులకు విషపూరితమైనవే కాకుండా ప్రాణాంతకం అని హెచ్చరించింది. అయితే గత ఏడాది కొన్ని దేశాల్లో ఇలాంటి సిరప్‌లతో సంబంధం ఉన్న పిల్లల మరణాల తరువాత డబ్ల్యూహెచ్‌ఓ మంగళవారం ఈ ప్రకటన చేయడం కలకలం రేపింది.