సైబర్ మోసగాళ్ల చేతిలో రూ. 69 లక్షలు పోగొట్టుకున్న రిటైర్డ్ ఉద్యోగి

ఆదాయ పన్ను దర్యాప్తు చేయాలంటూ ఏకంగా రూ. 69 లక్షలు దోచుకున్నారు

Update: 2024-04-12 08:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కి బెంగళూరుకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి లక్షల రూపాయల సొమ్మును పోగొట్టుకున్నాడు. ఢిల్లీకి చెందిన సీఐడీ, బ్యాంకు అధికారుల పేర్లతో సైబర్ మోసగాళ్లు బాధితుడిని బెదిరించి, ఆదాయ పన్ను దర్యాప్తు చేయాలంటూ ఏకంగా రూ. 69 లక్షలు దోచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఐసీఐసీఐ బ్యాంకు అధికారులమని చెప్పి బెంగళూరుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగికి నిందితులు ఫోన్ చేశారు. అనంతరం రాజస్థాన్ బ్రాంచులో క్రెడిట్ కార్డుకు సంబంధించి రూ. 1.45 లక్షల బకాయి ఉన్నట్టు నమ్మించారు. కంగారు పడిన బాధితుడు రాజస్థాన్‌లో తనకు సదరు బ్యాంకు ఖాతా ఉన్నప్పటికీ, క్రెడిట్ కార్డు లేదని చెప్పాడు. కానీ, ఫోన్ కాల్ ఢిల్లీ సీఐడీ సైబర్ సెల్ అధికారులకు బదిలీ చేస్తున్నట్టు నటించి, ఎవరో తన పేరున కార్డు తీసుకుని వాడుతున్నట్టు సైబర్ మోసగాళ్లు భయపెట్టారు. క్రెడిట్ కార్డు కేసు నుంచి బయటపడేందుకు రూ. 5 లక్షలు చెల్లించాలన్నారు. ఆ సమయంలో యూరప్ టూర్‌కు వెళ్లిన బాధితుడు సమస్యను పరిష్కరించే క్రమంలో వాళ్లు అడిగిన సొమ్ము చెల్లించాడు.

బాధితుడు తమ మాయలో పడినట్టు గుర్తించిన సైబర్ మోసగాళ్లు ఆదాయ పన్ను దర్యాప్తు పేరుతో మళ్లీ బెదిరించారు. ఐటీ విచారణ కింద ఫండ్ ఇన్వెస్టిగేషన్, అండర్‌కవర్ బ్యాంకు అకౌంట్లకు నగదు బదిలీ చేయాలని చెప్పడంతో భయాందోళనకు గురైన బాధితుడు మార్చి 6 నుంచి మార్చి 17 మధ్య ఏడు బ్యాంకు ఖాతాలకు రూ. 69 లక్షల వరకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐటీ చట్టంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. 

Tags:    

Similar News