హర్యానాలో ఇంటర్నెట్ బ్యాన్ పొడిగింపు: ఆరో రోజూ వెనక్కి తగ్గని రైతులు

ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చిన రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా ఆరో రోజూ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్ బ్యాన్‌ను హర్యానా ప్రభుత్వం

Update: 2024-02-18 04:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చిన రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా ఆరో రోజూ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్ బ్యాన్‌ను హర్యానా ప్రభుత్వం ఈనెల 19(సోమవారం) వరకు పొడిగించింది. మొత్తం ఏడు జిల్లాలు అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాద్, సిర్సాలో నిషేధం విధించారు. ఈ ప్రాంతాలు రైతుల నిరసనల్లో అత్యధికంగా ప్రభావితమయ్యాయి. ఇక్కడ పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. తప్పుడు సందేశాలు వ్యాప్తి చెందుతున్నాయనే ఆరోపణలతో ఇంటర్నెట్ నిలిపి వేస్తున్నట్టు వెల్లడించారు. కాగా, తమ డిమాండ్ల పరిష్కారానికి ఢిల్లీ మార్చ్‌కు బయలుదేరిన రైతులను పంజాబ్-హర్యానాలోని శంభు సరిహద్దులో పోలీసులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

నేడు నాలుగో రౌండ్ చర్చలు

రైతులు డిమాండ్ చేస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ఇప్పటికే రైతులతో మూడు సార్లు చర్చలు జరిపింది. కానీ అవన్నీ విఫలం కావడంతో ఆదివారం మరోసారి చర్చలు జరపనుంది. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూశ్ గోయల్, నిత్యానంద్ రాయ్‌లు రైతులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకుంటే ఢిల్లీకి పాదయాత్ర చేస్తామని రైతులు ఇప్పటికే హెచ్చరించారు. కాగా, ఎంఎస్పీకి చట్టపరమైన హామీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతు కూలీలకు పెన్షన్, వ్యవసాయ రుణాల మాఫీ, గత ఉద్యమంలో భాగంగా నమోదు చేసిన కేసుల ఉపసంహరణ వంటివి ప్రధానంగా రైతుల డిమాండ్లలో ఉన్నాయి. 

Tags:    

Similar News