BREAKING :నీట్-యూజీ రీటెస్టుకు 750 మంది గైర్హాజరు

దిశ, నేషనల్ బ్యూరో : నీట్ పరీక్షలో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థుల కోసం ఆదివారం నిర్వహించిన రీటెస్ట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-06-23 13:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో : నీట్ -యూజీ పరీక్షలో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థుల కోసం ఆదివారం నిర్వహించిన రీటెస్ట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆశ్చర్యకరంగా మొత్తం అభ్యర్థుల్లో దాదాపు సగం మంది (48 శాతం) రీటెస్టుకు గైర్హాజరయ్యారు. కారణాలు ఏవైనప్పటికీ సగానికి సగం మంది రీటెస్టుకు హాజరయ్యేందుకు నిరాసక్తి చూపడం గమనార్హం. మొత్తం 1,563 మంది అభ్యర్థులకుగానూ కేవలం 813 మంది (52 శాతం) రీటెస్ట్‌కు హాజరయ్యారు. దాదాపు 750 మంది రీటెస్టుకు దూరంగా ఉండిపోయారు. పరీక్ష అనంతరం ఆదివారం సాయంత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈవివరాలను వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, మేఘాలయ, చండీగఢ్‌లలోని పరీక్షా కేంద్రాల్లో రీటెస్టు జరిగిందని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో రీటెస్టు రాయాల్సిన 602 మందిలో 291 మంది హాజరవగా, 311 మంది గైర్హాజరు అయ్యారు. హర్యానాలో రీటెస్టు రాయాల్సిన 494 మందిలో 287 మంది హాజరవగా, 207 మంది గైర్హాజరు అయ్యారు. మేఘాలయలో రీటెస్టు రాయాల్సిన 464 మందిలో 234 మంది హాజరవగా, 230 మంది గైర్హాజరు అయ్యారు. చండీగఢ్‌లో రీటెస్టుకు ఇద్దరు హాజరుకావాల్సి ఉండగా.. ఇద్దరూ హాజరుకాలేదు. గుజరాత్‌లో ఒక్క విద్యార్థికి రీటెస్టు జరగాల్సి ఉండగా.. అతడు కూడా పరీక్షకు రాలేదు.

గ్రేస్ మార్కుల కేటాయింపు తర్వాత..

మే 5న ‘నీట్ యూజీ - 2024’ ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష సందర్భంగా సాంకేతిక సమస్యల కారణంగా పలుచోట్ల విద్యార్థులకు తప్పుడు ప్రశ్నపత్రాలు అందాయి. వాటిని మార్చి సరైన ప్రశ్నపత్రాలు ఇవ్వడంలో జాప్యం జరిగింది. ఈ ఆలస్యానికి పరిహారంగా దాదాపు 1,563 మంది విద్యార్థులకు ఎన్‌టీఏ గ్రేస్ మార్కులు కేటాయించింది. అయితే వారికి గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని తప్పుపడుతూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు వారికి కేటాయించిన గ్రేస్ మార్కులను ఎన్‌టీఏ తొలగించింది. ఆ 1563 మందిలో మే 5న పరీక్షలో నష్టపోయామని భావించే వారంతా జూన్ 23న రీటెస్టుకు హాజరుకావాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కోరింది. ఈనెల 30న రీటెస్టు ఫలితాలను విడుదల చేస్తామని వెల్లడించింది.


Similar News