EV : ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఒక మోదం.. ఒక ఖేదం
దిశ, నేషనల్ బ్యూరో : ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) రంగంపై నేరుగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
దిశ, నేషనల్ బ్యూరో : ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) రంగంపై నేరుగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈవీ తయారీ కంపెనీలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఫేమ్ 3’ రాయితీ స్కీంకు కూడా బడ్జెట్‌లో చోటుదక్కలేదు. ‘ఫేమ్’ అంటే ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్’ అని ఫుల్ ఫామ్. సబ్సిడీలు ఇవ్వడం ద్వారా దేశంలో ఈవీ టూ వీలర్ సేల్స్ పెంచేందుకు ఫేమ్ స్కీంను 2015 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. గతేడాది కేంద్ర బడ్జెట్‌లోనూ ఫేమ్-2 స్కీంకు దాదాపు రూ.2,900 కోట్లు కేటాయించారు.
కానీ ఈసారి కొత్తగా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. కనీసం ‘ఫేమ్’ స్కీంను పొడిగించి.. ఫేమ్ -3ని మొదలుపెడతారా ? లేదా ? అనే దానిపైనా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ బడ్జెట్‌లో ఈవీ రంగానికి ఒక ఆశాజనక అంశం ఉంది. అదేమిటంటే.. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ కాంపోనెంట్స్‌పై ట్యాక్స్‌లను తగ్గించారు. ఈవీల బ్యాటరీ తయారీలో కీలకంగా వినియోగించే లిథియం, కాపర్, కోబాల్ట్‌లను బేసిక్ కస్టమ్ డ్యూటీ పరిధి నుంచి కేంద్రం మినహాయించింది. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధర తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.