పెరగనున్న ‘యాంటీ బయోటిక్స్’ ధరలు.. రేట్లు పెంచాలని నిర్ణయించిన ఫార్మా సంస్థలు
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి యాంటీ బయోటిక్స్ ధరలు పెరగనున్నాయి. వార్షిక పెంపులో భాగంగా డ్రగ్ కంపనీలకు ధరలు పెంచేందుకు కేంద్రం అనుమతించింది. వీటిలో పెయిన్ కిల్లర్స్, కార్డియక్ డ్రగ్‌తో పాటు యాంటీ ఇన్ఫెక్టివ్ వంటి అత్యవసర డ్రగ్స్ కూడా ఉన్నాయి. డ్రగ్స్ ధరల నియత్రణ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్‌పీపీఏ) 12 శాతం ధరలు పెరుగుతాయని తెలిపింది.
మొత్తం 27 థెరపీల్లో ఉపయోగించే 900 ఫార్ములాలతో కూడిన 384 డ్రగ్స్ ధరలు పెరిగే అవకాశం ఉందని ఎన్‌పీపీఏ ప్రకటించింది. గతేడాది కూడా 12 శాతమే ధరలు పెంచడం గమనార్హం. మరోవైపు నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ (ధరల నియంత్రణలో లేనివి) ఏటా 10 శాతం పెంచేందుకు ఎన్‌పీపీఏ అనుమతించింది. దీని ప్రకారం వీటి ధరలు కూడా 10 శాతం పెరగనున్నాయి. రా మెటరీయల్స్‌తో పాటు ప్యాకేజింగ్ మెటేరియల్ ధరలు పెరుగుతున్న తరుణంలో ఫార్మాస్యూటికల్ రంగానికి ఇది శుభవార్త కానుంది.