'అధిక పెన్షన్' దరఖాస్తు గడువు మళ్ళీ పొడిగింపు ..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) స్కీమ్ కింద అధిక పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును మూడోసారి పొడిగించారు.

Update: 2023-06-26 16:47 GMT

న్యూఢిల్లీ : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) స్కీమ్ కింద అధిక పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును మూడోసారి పొడిగించారు. అర్హులైన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సభ్యులు జూలై 11 వరకు తమ అప్లికేషన్లను సబ్మిట్ చేయొచ్చు. వాస్తవానికి అధిక పెన్షన్ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారమే (జూన్ 26) ముగిసింది. అధిక పెన్షన్ పొందే అర్హత కలిగిన ఎంతోమంది ఈపీఎఫ్ఓ సభ్యులు తమ ఆధార్ కార్డ్‌లలో మార్పులు చేసిన తర్వాత అప్లికేషన్లను సమర్పించలేకపోయారు. మరికొందరు జాయింట్ ఆప్షన్ వ్యాలిడేషన్ ప్రక్రియలో సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి వారు హయ్యర్ పెన్షన్ పొందే అవకాశాన్ని చేజార్చుకోకుండా చేసే ఉద్దేశంతో దరఖాస్తు గడువును ఈపీఎఫ్ఓ మరోసారి పెంచింది. ఉద్యోగులు, యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సానుభూతితో పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అధిక పెన్షన్ కోసం 15 లక్షల మందికిపైగా అప్లై చేసినట్టు తెలుస్తోంది. అధిక పెన్షన్‌ను లెక్కించడంలో ఉద్యోగులకు సహాయపడటానికి ఒక కాలిక్యులేటర్‌ను కూడా సోమవారం ఉదయమే ఈపీఎఫ్ఓ ప్రారంభించింది.


Similar News