ఎన్నికల అబ్జర్వర్లకు ఈసీ కీలక సూచనలు ఇవే..

దిశ, నేషనల్ బ్యూరో : నిర్బంధాలు, బెదిరింపులకు తావు లేని వాతావరణంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎన్నికల అబ్జర్వర్లకు కేంద్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది.

Update: 2024-03-11 18:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో : నిర్బంధాలు, బెదిరింపులకు తావు లేని వాతావరణంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎన్నికల అబ్జర్వర్లకు కేంద్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. కేంద్ర, రాష్ట్ర బలగాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని.. అవి ఏ పార్టీకీ అనుకూలంగా వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లోనే ప్రకటన వెలువడనుంది. ఈనేపథ్యంలో 2100 మందికిపైగా ఎన్నికల పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సుదీర్ఘ సమావేశం నిర్వహించింది. వీరిలో సాధారణ, పోలీసు, వ్యయ విభాగాల పరిశీలకులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు క్షేత్రస్థాయిలో అనుకూలమైన వాతావరణం కల్పించాలని అబ్జర్వర్లను కోరారు. విధులు కేటాయించిన ప్రాంతాల్లో ఎన్నికల సంఘానికి కళ్లు, చెవుళ్లా వ్యవహరించాలని ఆయన సూచించారు. బెదిరింపులు, ప్రలోభాలకు తావులేకుండా చూడాలని.. ఎన్నికల సంఘం ప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఈసీ చెప్పారు. అభ్యర్థులతో పాటు అన్ని భాగస్వామ్యపక్షాలకు పరిశీలకులు అందుబాటులో ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో కఠినంగా వ్యవహరిస్తూనే.. మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ సూచించారు. ఎన్నికలు ముగిసేంత వరకు పరిశీలకులు తమకు కేటాయించిన లోక్‌సభ నియోజకవర్గాలకే పరిమితమై ఉండాలని, వారి వాహనాల్లో జీపీఎస్‌ ట్రాకింగ్‌ అమర్చాలని ప్రతిపాదించారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతకు సంబంధించి పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షలు నిర్వహించింది.

Tags:    

Similar News