జమ్మూకశ్మీర్‌ పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో సోమవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

Update: 2024-06-03 12:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో సోమవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పాకిస్థాన్‌ లష్కరే తోయిబాకు చెందిన అగ్రకమాండర్‌తో పాటు మరొక ఉగ్రవాది మృతి చెందాడు. సోమవారం ఉదయం పుల్వామా జిల్లాలోని నెహమా ప్రాంతంలో ఉగ్రవాదులు రహస్య స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందడంతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిని చూసిన ఉగ్రవాదులు భారత బలగాలపై కాల్పులు జరిపారు. దీంతోసెర్చ్ ఆపరేషన్ కాస్త ఎన్‌కౌంటర్‌గా మారిందని ఒక అధికారి తెలిపారు.

హతమైన ఉగ్రవాదులను ఆపరేషనల్ కమాండర్ రియాజ్ దార్, అతని సహచరుడు రయీస్ అహ్మద్‌గా గుర్తించారు. రియాజ్ 2015 నుండి యాక్టివ్‌గా ఉన్నాడు. హత్యలు, గ్రెనేడ్ దాడులు చేయడంతో పాటు, టెర్రర్ యాక్టివిటిస్ కోసం కొత్త రిక్రూట్‌లు చేయడంలో దిట్ట. అతనికి 20కి పైగా ఉగ్రవాద దాడుల్లో ప్రమేయం ఉంది. అతని తలపై 10 లక్షల రూపాయల బహుమతి ఉంది. దక్షిణ కాశ్మీర్‌లో లష్కర్‌ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్న ఉగ్రవాదులకు ఈ ఎన్‌కౌంటర్ పెద్ద ఎదురుదెబ్బ అని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి.

ఇంతకుముందు మే 7న జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల్లో లష్కరే మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)లో కీలక కార్యకర్త బాసిత్ దార్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం అక్కడి లోయ ప్రాంతాలను భద్రతా దళాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి.


Similar News