జమ్మూకశ్మీర్‌లో మరోసారి భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్

జమ్మూకశ్మీర్‌లో మంగళవారం మరోసారి భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి

Update: 2024-07-09 13:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో మంగళవారం మరోసారి భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. దోడా జిల్లాలోని గోలి-గడి అటవీ ఎగువ ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనే దానిపై పూర్తి సమాచారం లభించలేదు. ప్రస్తుతం భద్రతా బలగాలు అక్కడి ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.

ఇటీవల కథువా జిల్లాలో మాచేడి ప్రాంతంలో ఆర్మీ పెట్రోలింగ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడగా, ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డారు. దీంతో అక్కడి ప్రాంతాలను భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న క్రమంలో ఈ కాల్పులు జరగడం గమనార్హం. దోడా ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఉగ్రవాదులు సోమవారం నాటి దాడిలో పాల్గొనే అవకాశం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

నిఘా వర్గాల సమాచారం ప్రకారం, దాదాపు 60 మందికి పైగా శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఒక్క జమ్మూ ప్రాంతంలోనే పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా లోయలో ఉగ్ర కదలికలు విస్తృతం అయిన నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో అంతం చేయడానికి అక్కడ కుంబింగ్ ఆపరేషన్లను మరింత తీవ్రతరం చేస్తున్నారు. ప్రధాని మోడీ ఇటీవల మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై పోరాటం చివరి దశలో ఉంది. అక్కడ మిగిలి ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్మూలించడానికి బహుముఖ వ్యూహంతో కదులుతున్నామని చెప్పారు.


Similar News