Congress : అదానీ గ్రూపుతో సెబీ ఛైర్‌పర్సన్ సంబంధంపై నిజానిజాలను నిగ్గుతేల్చాలి : కాంగ్రెస్
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ కంపెనీ ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ విడుదల చేసిన సంచలన నివేదికపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ కంపెనీ ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ విడుదల చేసిన సంచలన నివేదికపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ నివేదికలోని ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. సెబీ ఛైర్‌పర్సన్ మాధవీ బుచ్ స్థాయి వ్యక్తులకు అదానీ గ్రూపుతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అదానీ గ్రూపుపై గతంలో హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చిన సందర్భంలో జరిగిన సెబీ దర్యాప్తుపై సందేహాలు రేకెత్తుతున్నందున, వాటిని వెంటనే నివృత్తం చేయాల్సిన బాధ్యత కేంద్ర సర్కారుపైనే ఉందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ‘‘అదానీ గ్రూప్‌కు విదేశీ నిధుల పంపింగ్‌పై దర్యాప్తు చేయించేందుకు సెబీ ఎందుకు ఆసక్తి చూపించలేదో ఇప్పుడు అర్థమైంది. దీన్ని సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ కూడా గుర్తించలేకపోయింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘పార్లమెంటు సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయని తొలుత చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆగస్టు 9న మధ్యాహ్నం అకస్మాత్తుగా వాటిని వాయిదా ఎందుకు వేసిందో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోంది’’ అని తెలిపారు.
నా లేఖకు సెబీ ఎందుకు స్పందించలేదో అర్థమైంది : ప్రియాంక చతుర్వేది
హిండెన్‌బర్గ్ నివేదికపై తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘‘సెబీ ఛైర్‌పర్సన్ కూడా అదానీ గ్రూపులో పెట్టుబడిదారే అని హిండెన్‌బర్గ్ చెప్పింది. ఇక విచారణ కోసం సీబీఐ, ఈడీలను రంగంలోకి దింపుతారా ?’’ అని సర్కారును ఆమె ప్రశ్నించారు. గతంలో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టును కోరారు. ‘‘అదానీ గ్రూప్ కంపెనీల వివరాలను కోరుతూ నేను రాసిన లేఖలకు సెబీ ఎందుకు సమాధానం ఇవ్వలేదో నాకు ఇప్పుడు అర్థమైంది’’ అని శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.