వేల కోట్ల నుంచి వందల కోట్ల దాకా విరాళాలిచ్చిన తెలుగు కంపెనీలివే
దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం తు.చ తప్పకుండా అమలు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం తు.చ తప్పకుండా అమలు చేసింది. ఎస్‌బీఐ అందించిన ఎలక్టోరల్ బాండ్ల చిట్టాను గురువారం సాయంత్రమే విప్పేసింది. 763 పేజీల్లోని ఎలక్టోరల్ బాండ్ల విరాళాల వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్ eci.gov.in వేదికగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో ఏయే రాజకీయ పార్టీలకు ఎన్ని విరాళాలు వచ్చాయి ? ఆ విరాళాలను ఇచ్చిన దాతలు ఎవరు ? అనే కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల బాండ్ల సమాచారాన్ని https://www.eci.gov.in /candidate-politicalparty లింకు ద్వారా తెలుసుకోవచ్చని ఈసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.పార్ట్-1లో ఎన్నికల బాండ్లు కొన్నవారి వివరాలు.. పార్ట్-2లో బాండ్లను ఎన్‌క్యాష్ చేసుకున్న పార్టీల వివరాలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎస్‌బీఐ ఇచ్చిన సమాచారాన్ని యథాతధంగా తమ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టామని తెలిపింది.
పార్టీలవారీగా విరాళాల లెక్క..
ఈ లిస్టు ప్రకారం..యావత్ భారత్‌లోని రాజకీయ పార్టీలకు 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి మధ్యకాలంలో ఎలక్టోరల్ బాండ్ల జారీ ద్వారా రూ.12,155 కోట్ల విరాళాలు అందాయి. దేశంలోనే అత్యధిక విరాళాలు పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆపార్టీకి రూ. 6,061 కోట్ల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండో ప్లేస్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. దానికి రూ.1,610 కోట్లు వచ్చాయి. మూడో ప్లేస్‌లో నిలిచిన కాంగ్రెస్‌కు రూ.1,422 కోట్లు రాగా, నాలుగో ప్లేసులో భారత రాష్ట్ర సమితి నిలిచింది.ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్‌కు రూ. 776 కోట్లు, తమిళనాడును పాలిస్తున్న డీఎంకే పార్టీకి రూ.639 కోట్లు, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి రూ.337 కోట్లు విరాళంగా వచ్చాయి. టీడీపీకి రూ.219 కోట్లు, జనసేన పార్టీకి రూ.21 కోట్లు, ఉద్ధవ్ శివసేనకు రూ.158 కోట్లు, లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీకి రూ.73 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.65 కోట్లు విరాళంగా అందాయి.
ఏ పార్టీకి ఎన్ని బాండ్లు ?
2018 నుంచి ఇప్పటివరకు బీజేపీకి అత్యధికంగా 8,633, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 3,305, కాంగ్రెస్ పార్టీకి 3,146, ఆమ్ ఆద్మీ పార్టీకి 245, డీఎంకేకు 648 బాండ్ల జారీ ద్వారా డొనేషన్స్ వచ్చాయి. భారత రాష్ట్ర సమితికి 1,806, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 472, టీడీపీకి 279, జనసేన పార్టీకి 39 ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందాయి.
టాప్ -10 దాతలు ఎవరో తెలుసా ?
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 2019 నుంచి 2024 మధ్యకాలంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో సగానికి సగం కేవలం 23 కంపెనీల నుంచే అందడం గమనార్హం. వీటిలో టాటా గ్రూప్, అదానీ గ్రూప్, రిలయన్స్ గ్రూప్ లేకపోవడం గమనార్హం. ఆ మూడు దిగ్గజ కంపెనీలు తప్పకుండా ఎలక్టోరల్ బాండ్ల లిస్టులో ఉంటాయని అంతా భావించారు. కానీ వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సమాచారాన్ని బట్టి తేటతెల్లమైంది. రాజకీయ పార్టీలకు భారీ విరాళం ఇచ్చిన దాత ఎవరో తెలుసా ? శాంటియాగో మార్టిన్. లాటరీ కింగ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఈయన రూ.2,455.20 కోట్లను విరాళంగా ఇచ్చాడు. దీన్నిబట్టి అతడి సంపాదన ఏ రేంజ్‌లో ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో లాటరీ సేల్స్ లీగల్‌గా జరుగుతున్న 13 రాష్ట్రాల్లో మార్టిన్ బిజినెస్ చేస్తూ నిత్యం కోట్లు సంపాదిస్తున్నాడు. 2023 సంవత్సరం మేలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తమిళనాడులోని శాంటియాగో మార్టిన్ వ్యాపారాలపై రైడ్స్ చేసింది. ఆ సందర్భంగా రూ.457 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ ఫ్రీజ్ చేసింది.
రెండో పేరు మన హైదరాబాద్ కంపెనీదే..
అత్యధిక విరాళం ఇచ్చిన కంపెనీల లిస్టులో రెండో పేరు మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాదే. ఈ కంపెనీ రూ.2318 కోట్లు డొనేషన్‌గా అందించింది. మహారాష్ట్రకు చెందిన క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.658 కోట్లు, వేదాంత లిమిటెడ్ రూ.729.3 కోట్లు, హల్దియా ఎనర్జీ లిమిటెడ్ రూ.752 కోట్లు, ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండ్స్ లిమిటెడ్ రూ.449 కోట్లు, కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ రూ.390 కోట్లు, ఎంకేజే ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ రూ.370.74 కోట్లు, మదన్‌లాల్ లిమిటెడ్ రూ.347 కోట్లు విరాళంగా అందించాయి. భారతీ ఎయిర్ టెల్ గ్రూపు రూ.330 కోట్లు, వెస్ట్రన్ యూపీపవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ రూ.220 కోట్లు, యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రూ.270.6 కోట్లు, ఉత్కల్ అల్యుమిన ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.270.6 కోట్లు, డీఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్ లిమిటెడ్ రూ.256.6, కోట్లు, ధరివాల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.230 కోట్లు, బిర్లా కార్బో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.210 కోట్లు, చెన్నై గ్రీన్ వుడ్స్ రూ.210 కోట్లు, బీజీ శిర్కే కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ రూ.200 కోట్లు విరాళంగా పార్టీలకు ఇచ్చాయి.
డాక్టర్ రెడ్డీస్, ఎన్‌సీసీ, దివీస్, నాట్కో..
జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ రూ.196 కోట్లు, రంగ్తా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.174 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ రూ.160 కోట్లు, ఐఎఫ్‌బీ ఆగ్రో రూ.156.6 కోట్లు, ప్రారంభ్ సెక్యూరిటీస్ రూ.132 కోట్లు, శ్రీ సిద్ధార్థ ఇన్ ఫ్రా టెక్ సర్వీసెస్ రూ. 120.2 కోట్లు, ఎన్‌సీసీ లిమిటెడ్ రూ.120 కోట్లు విరాళంగా అందించాయి. ఇన్ఫిన ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్120 కోట్లు, దివీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ 110 కోట్లు, యునైటెడ్ ఫాస్పరస్ ఇండియా 100 కోట్లు, అవీస్ ట్రేడింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 100 కోట్లు, నాట్కో ఫార్మా 94.5 కోట్లు, పీసీబీఎల్ లిమిటెడ్ 90 కోట్లు, ఎంఎస్ఎస్ఎన్ మొహంతీ 90 కోట్లు, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ 90 కోట్లు, రామ్ కో సిమెంట్స్ 88 కోట్లు, సస్మాల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 88 కోట్లు, అరబిందో ఫార్మా 88 కోట్లు, రాజపుష్ప 25 కోట్లు, హెటిరో డ్రగ్స్ 40 కోట్లు, హెటిరో ల్యాబ్స్ 20 కోట్లు విరాళంగా ఇచ్చాయి. వెల్స్ ఫన్ 45 కోట్లు, ఎంఎస్ఎన్ ఫార్మా 20 కోట్లు, శ్రీచైతన్య 10 కోట్లు, గ్రీన్ కో ఎనర్జీ 07 కోట్లు, ఇనార్బిట్ మాల్ 10 కోట్లు, ఎన్ఎస్ఎల్ సెజ్ 20 కోట్లు, ఆర్ఎస్ బ్రదర్స్ 01 కోట్లు విరాళం అందించాయి.
తెలుగు రాష్ట్రాల దాతలు వీరే..
రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు ద్వారా విరాళాలను అందించిన దాతల లిస్టులో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా కంపెనీలే ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.. పీవీ క్రిష్ణారెడ్డికి చెందిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఈ లిస్టులో ఉంది. వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ కూడా పార్టీలకు విరాళాలు ఇచ్చింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పి.ఆర్.రెడ్డి.. ఈ కంపెనీ బోర్డులో డైరెక్టర్‌గా ఉండటం గమనార్హం. తెలంగాణ పారిశ్రామిక దిగ్గజం జూపల్లి రామేశ్వర్ రావుకు చెందిన మై హోం ఇన్‌ఫ్రా దాతల లిస్టులో ఉంది. హైదరాబాద్‌లో ప్రఖ్యాతి గడించిన అపర్ణ ఫామ్స్ అండ్ ఎస్టేట్స్ విరాళం ఇచ్చింది. ఫార్మా రంగానికి చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ఫార్మా దిగ్గజం సత్యనారాయణరెడ్డికి చెందిన ‘ఎంఎస్ఎన్ ఫార్మా కెమ్’, ఎంఎస్ఎన్ లేబొరేటరీస్ దాతల లిస్టులో ఉన్నాయి.తెలుగు పారిశ్రామికవేత్త వెంకయ్యచౌదరి నన్నపనేనికి చెందిన నాట్కో ఫార్మా నుంచి సైతం విరాళాలు అందాయి. హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్లు తయారు చేసే భారత్ బయోటెక్ లిమిటెడ్ సైతం విరాళాలను అందించింది. తెలంగాణ, ఏపీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ వల్లూరుపల్లి ప్రభుకిశోర్ దాతల జాబితాలో ఉన్నారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కంపెనీ ప్రమోటర్లు విశ్వేశ్వర రెడ్డి, కె.రవికుమార్ రెడ్డిలకు ఏపీ సీఎం జగన్‌కు సన్నిహితులుగా పేరుంది. ఈ కంపెనీ కూడా విరాళాలు ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే శ్రీ సిద్ధార్థ్ ఇన్ ఫ్రా టెక్ అండ్ సర్వీసెస్ దాతల లిస్టులో ఉంది. పొనుగోటి హేమేందర్ రావు అనే ఓ తెలుగు దాత పేరు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో ఉన్నారు.
*************
పార్టీలకు వ్యక్తిగత విరాళాలు (రూ.లలో)
మందాడి రాములు - 4 కోట్లు
ముళ్లపల్లి కోటేశ్వర్ రావు - 5 కోట్లు
కోనేరు రవితేజ - 20 లక్షలు
కుందూరు పవన్ రెడ్డి - 50 లక్షలు
తేజవర్ధన్ రెడ్డి - 50 లక్షలు
బండి రవీంద్రనాథ్ రెడ్డి - 50 లక్షలు
కౌకుంట్ల వేణుగోపాల్ - 10 లక్షలు
సంగిరెడ్డి తిరుపతి రెడ్డి - 5 లక్షలు
*************