న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ హోదా అంశాన్ని పరిశీలిస్తున్నామని ఎన్నికల కమిషన్ తెలిపింది. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ‘సమీక్షిస్తున్నాం. త్వరలోనే మీకు తెలియజేస్తాం’ అని అన్నారు. గతేడాది అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఎన్నికల పనితీరు జాతీయ ఎన్నికల సంఘం గుర్తింపుకు మార్గం సుగమం చేసింది. 1968 (రిజర్వేషన్, అలాట్‌మెంట్) ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ ప్రకారం.. ఏదైనా పార్టీకి జాతీయ హోదా రావాలంటే ఆ పార్టీ కనీసం నాలుగు రాష్ట్రాల్లో స్టేట్ పార్టీగా గుర్తింపు పొందాలి.
అంతేకాకుండా కనీసం ఇద్దరు చొప్పున ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ సభ్యులుగా ఉండాలి. ఆయా రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లతో రెండు నియోజకవర్గాల్లో గెలిచి ఉండాలి. అయితే ఆప్ ఢిల్లీ, పంజాబ్, గోవా, గుజరాత్‌లలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. గతేడాది పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 117కుగాను 92 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో అక్కడ రాష్ట్ర పార్టీగా గుర్తింపు లభించింది. ఇక గోవాలో 6.77 శాతం ఓట్లతో రెండు స్థానాల్లో విజయం సాధించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 13 శాతం ఓటు షేర్‌తో ఐదు సీట్లు సొంతం చేసుకుంది.