ఐదేళ్లలో రూ.16వేల కోట్ల ఎన్నికల బాండ్ల విక్రయం
లోక్‌సభ ఎన్నికలకు కేవలం నెలల సమయం మాత్రమే ఉన్న వేళ సుప్రీంకోర్టు తీర్పు రాజకీయ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని భారత అత్యున్నత న్యాయస్థానం గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. తక్షణం ఎన్నికల బాండ్ల జారీ నిలిపేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికలకు కేవలం నెలల సమయం మాత్రమే ఉన్న వేళ సుప్రీంకోర్టు తీర్పు రాజకీయ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రధానంగా ఈ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర అధికార బీజేపీకి ఈ నిర్ణయం గట్టి దెబ్బగానే భావించాలి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. 2018లో ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత, ఇప్పటివరకు సుమారు 28 వేల ఎన్నికల బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) విక్రయించింది. వీటన్నిటి విలువ ఏకంగా రూ. 16 వేల కోట్ల కంటే ఎక్కువని ఇప్పటివరకు ఉన్న గణాంకాలు చెబుతున్నాయి. ఎలక్షన్ కమిషన్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ప్రకారం, 2018 మార్చి నుంచి 2024, జనవరి వరకు ఎలక్టోరల్ బాండ్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తం నిధులు రూ.16,518.11 కోట్లు.
2016-22 మధ్యకాలంలో ఈ పథకం కింద వచ్చిన విరాళాలలో 60 శాతానికి పైగా బీజేపీ పార్టీ పొందడంతో, ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేయడం ఆ పార్టీపై ఎక్కువ ఎక్కువ ప్రభావం చూపనుంది. వ్యక్తులు, వ్యాపార వర్గాలు రాజకీయ పార్టీలకు వివరాలు చెప్పకుండా అందించే విరాళాలకు తెచ్చిందే ఈ ఎన్నికల బాండ్లు. నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా, రాజకీయ నిధులలో పారదర్శకతను తెచ్చేందుకు 2018లో బీజేపీ ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది.
ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, 2016-2022 మధ్య మొత్తం రూ. 16,437.63 కోట్ల విలువైన 28,030 ఎలక్టోరల్ బాండ్లు విక్రయించబడ్డాయి. ఈ మొత్తంలో సింహభాగం రూ. 10,122 కోట్లను బీజేపీ అందుకుంది. ఇది మొత్తం విరాళాల్లో 60 శాతానికి సమానం. ఆ తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్ రూ. 1,547 కోట్లు(10 శాతం) అందుకోగా, పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ రూ. 823 కోట్లు(8 శాతం) అందుకుంది.
ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి వచ్చిన విరాళాలు జాబితాలోని ఇతర 30 పార్టీల కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం.
ఈసీ నివేదిక ప్రకారం ప్రధాన ఏడు జాతీయ పార్టీలకు అందిన విరాళాలు..
బీజేపీ: రూ. 10,122 కోట్లు
కాంగ్రెస్: రూ. 1,547 కోట్లు
టీఎంసీ: రూ. 823 కోట్లు
సీపీఐ(ఎం): రూ. 367 కోట్లు
ఎన్సీపీ: రూ. 231 కోట్లు
బీఎస్‌పీ: రూ. 85 కోట్లు
సీపీఐ: రూ. 13 కోట్లు
2017 -2022 మధ్య ఎన్నికల బాండ్ల ద్వారా కాంగ్రెస్ పొందిన విరాళాల కంటే బీజేపీ ఐదు రెట్లు ఎక్కువ విరాళాలను పొందిందని ఈసీ గణాంకాలు చెబుతున్నాయి.
గత ఆర్థిక సంవత్సరం(2022-23)లో, బీజేపీ మొత్తం రూ. 2,360 కోట్లు ఆదాయం పొందగా, ఎన్నికల బాండ్ల ద్వారా దాదాపు రూ.1,300 కోట్లు అందుకుంది. కాంగ్రెస్ ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన రూ.171 కోట్లతో కలిపి మొత్తం ఆదాయం రూ.452 కోట్లకు పడిపోయింది.
బీఆర్ఎస్‌దే అధికం..
మిగిలిన ఇతర పార్టీల్లో గత ఆర్థిక సంవత్సరం ఈ బాండ్ల ద్వారా టీఎంసీ రూ. 325 కోట్లు, బీఆర్ఎస్ రూ. 529 కోట్లు, డీఎంకే రూ. 185 కోట్లు, బీజేడీ, రూ. 152 కోట్లు, టీడీపీ రూ. 34 కోట్లు అందుకున్నాయి. సమాజ్ వాదీ పార్టీ, శిరోమణి అకాలీదళ్ ఎన్నికల బాండ్ల ద్వారా ఎలాంటి విరాళాన్ని పొందలేదు. స్థానిక పార్టీల్లో బీఆర్ఎస్ ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలను పొందడం గమనార్హం.
కార్పొరేట్ కంపెనీలు దాదాపు సగం నిధులను ఎన్నికల బాండ్ల రూపంలో అందజేస్తాయి. రాజకీయ విరాళాల కోసం ఆర్థిక సాధనాలుగా పనిచేసే ఈ ఎన్నికల బాండ్లు, కొనుగోలుదారు, చెల్లింపుదారు పేరు లేకపోవడం వల్ల దాత వివరాలు గోప్యంగా ఉంటాయి. ఒకరు కొనుగోలు చేయడం లేదా విరాళంగా ఇవ్వగల బాండ్ల సంఖ్యకు గరిష్ట పరిమితి లేదు. అవి రూ. 1,000, రూ. 10,000, రూ. 1 లక్ష, రూ. 10 లక్షలు, రూ. 1 కోటి డినామినేషన్‌లలో లభిస్తాయి.
ఈ బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన బ్రాంచుల ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తుంది. రాజకీయ పార్టీలు తప్పనిసరిగా 15 రోజుల్లోగా ఈ బాండ్లను రీడీమ్ చేసుకోవాలి. లేకపోతే, ఆయా నిధులు పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్‌కి బదిలీ అవుతాయి.