బుచ్చిబాబును కస్టడీకి ఇవ్వండి.. స్పెషల్ కోర్టుకు ఈడీ రిక్వెస్ట్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరింత దూకుడు పెంచింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరింత దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గతంలో ఆడిటర్‌గా పనిచేసిన బుచ్చిబాబును కస్టడీకి అప్పగించాలని రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టును కోరింది. ఎంక్వయిరీకి రావాల్సిందిగా గతంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చామని, షెడ్యూలు ప్రకారం మార్చి 9న రావాల్సి ఉన్నదన్నారు. కానీ ఆయన స్పెషల్ రిక్వెస్టు చేయడంతో ఈనెల 13 వరకు గడువు ఇచ్చామని, ఆ ప్రకారం హాజరు కావాల్సి ఉన్నదని తెలిపారు. ఈనెల 15న హాజరు కావాల్సిందిగా మరోసారి బుచ్చిబాబుకు నోటీసులు ఇచ్చినట్లు ఈడీ వెల్లడించింది.
ఈ స్కామ్‌లో చేతులు మారిన ముడుపుల గురించి మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు జరపాల్సి ఉన్నదని, ఇందుకు పిళ్లై, బుచ్చిబాబును కలిపి విచారించాలనుకుంటున్నట్లు ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిళ్లై కస్టడీ నేటితో ముగుస్తున్నందున మరో మూడు రోజుల పాటు (ఈనెల 15 వరకు) పొడిగించాలని, అప్పుడే ఇద్దరినీ కలిపి జాయింట్‌గా విచారించడం వీలవుతుందని పేర్కొన్నారు. ఈడీ అభ్యర్థన మేరకు పిళ్లైకి మరో మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. మార్చి 16 వరకు పిళ్లై కస్టీడీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. దీంతో, మార్చి 15న బుచ్చిబాబుతో కలిపి పిళ్ళైను విచారించనున్నది. తదుపరి విచారణ మార్చి 16కి వాయిదా వేసింది.