రాహుల్‌‌గాంధీకి ఈసీ షోకాజ్ నోటీసు..

జేబు దొంగ (జేబ్ కత్రా), అపశకున పక్షి (పనౌతీ) అనే పదాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.

Update: 2023-11-23 12:27 GMT

న్యూఢిల్లీ : జేబు దొంగ (జేబ్ కత్రా), అపశకున పక్షి (పనౌతీ) అనే పదాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. దీంతో రాహుల్‌గాంధీకి ఎన్నికల సంఘం గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ పదాలను వాడటం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి ఎందుకు రాదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులో ఆయనను ఈసీ కోరింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు నవంబర్ 25న తమ ఎదుట హాజరుకావాలని రాహుల్‌ను ఆదేశించింది. ఇటీవల రాజస్థాన్‌లోని బార్మర్, జాలోర్, భరత్‌పూర్‌లలో జరిగిన ఎన్నికల ప్రచార సభలలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని ఎన్నికల సంఘానికి బీజేపీ తెలిపింది.

‘‘ప్రధాని మోడీ కొందరు బడా పారిశ్రామికవేత్తలకు గత తొమ్మిదేళ్లలో రూ.14 లక్షల కోట్ల రుణమాఫీ చేశారనే మరో ఆరోపణ కూడా రాహుల్ చేశారు. అందులో వాస్తవికత లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు’’ అని ఈసీకి ఇచ్చిన కంప్లయింట్‌లో బీజేపీ పేర్కొంది. ఒక జాతీయ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడిగా రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించింది. ‘‘ప్రధాని మోడీ అపశకునంలా మారబట్టే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌‌లో ఇండియా ఓడిపోయింది’’ అని ఈనెల 21న జాలోర్‌లో జరిగిన సభలో రాహుల్ అన్నారు. ఇక బుధవారం భరత్‌పూర్‌లో జరిగిన మరో సభలో రాహుల్ ప్రసంగిస్తూ.. ప్రధాని మోడీ, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీలను జేబుదొంగలతో పోల్చారు.

Tags:    

Similar News