ఢిల్లీలో అన్ని పాఠశాలలకు ముందస్తు శీతాకాల సెలవులు
దేశ రాజధానిలో తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు శీతాకాల సెలవులను ప్రకటించింది. నవంబర్ 9 నుంచి 18 వరకు ముందస్తు శీతాకాల సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ వెల్లడించింది. సాధారణంగా ఢిల్లీలో పాఠశాలలకు డిసెంబర్, జనవరి నెలల్లో శీతాకాల సెలవులు ఉంటాయి. కానీ, ఈ ఏడ్దాది రాష్ట్రమంతా కాలుష్య కోరల్లో చిక్కుకోవడంతో ముందుగా సెలవులను ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 18వ తేదీ వరకు అన్ని పాఠశాలలు మూసివేయబడతాయి. ఇక, ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రంగా మారుతోంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో గాలి నాణ్యత తీవ్రంగా 453కి చేరుకుంది. ఢిల్లీలోనూ మిగిలిన ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే స్థాయిలో నమోదవుతోంది.