లోక్‌సభకు పోటీ చేయకపోవడానికి కారణం చెప్పిన సోనియా గాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. బుధవారం నాడు ఆమె రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. బుధవారం నాడు ఆమె రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే లోక్‌సభకు కాకుండా రాజ్యసభకు నామినేషన్ వేయడానికి గల కారణాన్ని ఆమె వివరించారు. “పెరుగుతున్న వయసు, ఆరోగ్య సమస్యల కారణంగానే తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అందుకే రాజ్యసభకు నామినేషన్ వేసినట్లు” ఆమె చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా నేరుగా మీకు సేవ చేసే అవకాశం నాకు లభించదు, కానీ ఖచ్చితంగా నా హృదయం, ఆత్మ ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాయని ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇంతకుముందు 2019 ఎన్నికల సమయంలో ఇవే చివరి లోక్‌సభ ఎన్నికలని ఆమె ప్రకటించారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. ఆయన స్థానంలో ఇప్పుడు సోనియా నామినేషన్ వేశారు. సోనియా గాంధీ 1999లో అమేథీ నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా (ఎంపీ) ఎన్నికైనప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. తరువాత ఆమె లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉండగా, 2004 సార్వత్రిక ఎన్నికలలో రాయ్‌బరేలీ నుండి గెలుపొందింది.