అధ్యక్షుడిగా ఉంటే 24 గంటల్లో యుద్ధం ముగిసేది : Donald Trump
తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం రాకపోయేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
న్యూయార్క్: తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం రాకపోయేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రాబోయే లక్షల ఏళ్ల వరకు ఈ యుద్ధం ప్రసక్తే లేకుండా ఉండేదని చెప్పారు. గురువారం ట్రంప్ మాట్లాడిన వీడియోను ఆయన ప్రతినిధి లిజ్ హరింగ్టన్స్ ట్విట్టర్లో షేర్ చేశారు. తాను అధ్యక్ష పదవిలో ఉండి ఉంటే చర్చలతో యుద్ధాన్ని ముగించేవాడినని వీడియోలో తెలిపారు. ఈ భయానకమైన యుద్ధాన్ని 24 గంటల్లో ముగించేలా సంప్రదింపులు చేసే సామర్థ్యం తనకుందని చెప్పారు. ఉక్రెయిన్‌కు అమెరికా ట్యాంకులు ఇవ్వడం రష్యాను రెచ్చగొట్టే చర్యనేనని అన్నారు. 'ముందు ట్యాంకులు వచ్చాయి. ఆ తర్వాత అణుబాంబులు వస్తాయి. ఈ యుద్ధం ముగిసిపోతుంది' అంటూ బైడెన్‌పై సెటైర్లు వేశారు. కాగా, రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగి ఈ నెలతో ఏడాది కావొస్తుంది. మరోవైపు యుద్ధంలో రష్యాను ఎదురించేందుకు ఉక్రెయిన్‌కు యూఎస్ 31 ట్యాంకులు పంపుతామని హామీ ఇవ్వడం, జర్మనీ ఆయుధ సాయం చేస్తామని ప్రకటించాయి.