Donald Trump: ట్రంప్ 2.0.. అమెరికా అధ్యక్షుడిగా చారిత్రక విజయం
అమెరికా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. అంచనాలను తలకిందులు చేస్తూ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌పై అఖండ విజయం సాధించారు.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా(America) చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(డోనాల్డ్ ట్రంప్) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(America Presidential Elections) చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. అంచనాలను తలకిందులు చేస్తూ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌పై అఖండ విజయం సాధించారు. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ 270 మెజార్టీ మార్క్‌ను(మొత్తం ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 538) దాటి 277 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకోగా, కమలా హ్యారిస్ 224 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు పొందారు. నెక్ టు నెక్ పోటీ అంటూ వచ్చిన సర్వే అంచనాలకు భిన్నంగా ఉదయం నుంచే డొనాల్డ్ ట్రంప్ లీడ్‌లోకి వచ్చారు. 267 ఓట్ల వద్ద చాలా సేపు తేలకుండా ఫలితాలు నిలిచినా, స్వింగ్ స్టేట్ విస్కాన్సిన్‌ను గెలిచిన తర్వాత మ్యాజిక్ ఫిగర్‌ను ట్రంప్ అదిగమించారు. విస్కాన్సిన్‌తోపాటు ఆయన నార్త్ కరోలినా, జార్జియా, పెన్సిల్వేనియాను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. పెన్సిల్వేనియాలో విజయం తర్వాత ఆయన విక్టరీ స్పీచ్ ఇచ్చారు.
2016లో హిల్లరి క్లింటన్‌ను ఓడించి విజయం సాధించిన ట్రంప్.. 2020లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో పరాజయం పాలయ్యారు. తాజాగా కమలా హ్యారిస్‌ను ఓడించి డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. మీడియా సంస్థల అంచనాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తన విజయ సందేశాన్ని ఇవ్వగా.. కమలా హ్యారిస్ మాత్రం ఇంకా ఓటమి అంగీకరించలేదు. వాస్తవానికి అమెరికాలో సాయంత్రం ఆమె ప్రసంగించాల్సింది. కానీ, ఫలితాలు ఊహించని రీతిలో వెలువడుతుండటంతో కమల హ్యారిస్ కార్యక్రమం రద్దయింది. ఇది అపూర్వ విజయమని, అమెరికా ప్రజలు దేశం కోసం తీసుకున్న నిర్ణయమని ట్రంప్ తన విజయంపై స్పందించారు. దేశ ప్రజల ప్రయోజనాల కోసం ప్రతి క్షణం పని చేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలన్నీ మీడియా సంస్థల ప్రొజెక్షన్స్ మాత్రమే. అధికారిక ఫలితాలు లెక్కించడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుంది. కొన్ని స్వింగ్ స్టేట్‌లలో ఆబ్జెంటీ ఓట్లతో లెక్కింపు ప్రక్రియ జాప్యం కావొచ్చు. ఎన్నికల సర్టిఫై ప్రక్రియ డిసెంబర్ 17లోగా ముగియవచ్చు. జనవరి 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. యూఎస్ కాపిట్‌లో అమెరికా బాధ్యతలు తీసుకుంటారు.
మెజార్టీ రాష్ట్రాల్లో పాగా
27 రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ దాదాపుగా గెలిచేశారు. అలబామా, ఆర్కన్సాస్, ఫ్లోరిడా, జార్జియా, ఇదాహో, అయోవా, ఇండియానా, కన్సాస్, కెంటకీ, లూసియానా, మిస్సిసిప్పి, మిస్సోరీ, మోంటానా, నార్త్ డకోటా, నెబ్రాస్కా, నార్త్ కరోలినా, ఒహాయో, ఓక్లహామా, పెన్సిల్వేనియా, దక్షిణ కరోలినా, సౌత్ డకోటా, టెనెస్సీ, టెక్సాస్, యూటా, వెస్ట్ వర్జీనియా, వ్యోమింగ్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు.
కమలా హ్యారిస్ 18 రాష్ట్రాల్లో ముందంజలో నిలిచారు. కాలిఫోర్నియా, కొలరాడో, కనెక్టికట్, డెలవేర్, హవాయి, ఇలినాయిస్, మేరిలాండ్, మిన్నెసోటా, మసాచుసెట్స్, న్యూ హాంప్‌షైర్, న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, న్యూయార్క్, ఓరెగావ్, రోడ్ ఐలాండ్, వెర్మాంట్, వర్జీనియా, వాషింగ్‌టన్‌లలో డెమోక్రటిక్ అభ్యర్థి హ్యారిస్ విజయం సాధించారు. కాగా, నెవాడా, మిషిగన్, మైన్, ఆరిజోనా, అలస్కా రాష్ట్రాల్లో ఇంకా విజయం ఇద్దరి మధ్య దోబూచులాడుతున్నది. కానీ, ట్రంప్ ఎలక్టోరల్ ఓట్లు మ్యాజిక్ మార్క్‌ను దాటడంతో విజయాన్ని మీడియా సంస్థలు ఖరారు చేశాయి.