US Presidential Elections: బైడెన్ ని బెదిరించి తప్పించారు.. ట్రంప్ తీవ్ర ఆరోపణలు

Update: 2024-07-28 09:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికలను నుంచి అధ్యక్షుడు జో బైడెన్ ను బలవంతంగా తప్పించారని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఆరోపించారు. ఇదంతా డెమొక్రాట్లు పన్ని కుట్ర అని పేర్కొన్నారు. మిన్నెసోటాలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. బైడెన్‌కు (Biden) 1.4 కోట్ల ఓటర్ల మద్దతు ఉందన్న ట్రంప్‌.. కుట్ర ద్వారా ఆయన్ని రేసునుంచి తప్పించారన్నారు. అధ్యక్షుడిపట్ల దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. అవమానకర స్థితిలో తప్పించాల్సి వస్తుందని సొంతపార్టీ నేతలే బెదిరించారన్నారు. రాజ్యాంగంలోని 25వ ఆర్టికల్ పేరుతో బెదిరించారని ఆరోపించారు.

ఇప్పుడేమో ప్రశంసలు

మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు ఉన్న బైడెన్‌ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని డెమోక్రాట్లు బెదిరించారని ట్రంప్ (Trump) అన్నారు. బెదిరింపుల తర్వాతే రేసు నుంచి తప్పుకోవడానికి బైడెన్‌ (Biden) అంగీకరించినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచే ఆయనపై ప్రశంసలు కురిపించారన్నారు. అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ ఈనెల 20న ప్రకటించారు. కాగా.. కమలా హ్యారిస్ డెమొక్రాట్లు మద్దతు తెలపడంతో ఆమె అధ్యక్ష రేసులో నిలిచారు.


Similar News