Doctors strike: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఆరోగ్య సేవలు

కోల్‌కతాలోని జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చిన దేశవ్యాప్త 24 గంటల వైద్య సేవల బంద్ శనివారం ఉదయం ప్రారంభమైంది

Update: 2024-08-17 04:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చిన దేశవ్యాప్త 24 గంటల వైద్య సేవల బంద్ శనివారం ఉదయం ప్రారంభమైంది. అత్యవసర సేవలు మినహా అన్ని ఆరోగ్య సేవలు, సాధారణ OPDలు, శస్త్రచికిత్సలు శనివారం ఉదయం 6 నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నిలిచిపోనున్నాయి. డాక్టర్లు ఎమర్జెన్సీ కేసులను మాత్రమే చూస్తున్నారు. నిరసన తెలుపుతున్న వైద్యులకు సంఘీభావంగా కేంద్రం ఆధ్వర్యంలో నడిచే సఫ్దర్‌జంగ్, ఆర్‌ఎంఎల్ ఆసుపత్రుల వైద్యులు నల్ల రిబ్బన్‌లు ధరించి మౌన నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. వైద్య సమాజానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు ఏకం కావడంతో అన్ని రాష్ట్రాల్లో కూడా వైద్య సేవల్లో అంతరాయం ఏర్పడింది. అనేక ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ నిరసనకు మద్దతునిచ్చాయి. ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు సమ్మెలో పాల్గొంటున్నారు. కొంతమంది మాత్రం అత్యవసర రోగులు, ఐసీయూలో చేరిన రోగులకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. మెరుగైన పని పరిస్థితులు, కోల్‌కతా బాధితురాలికి న్యాయం చేయాలని, వైద్యుల రక్షణకు కేంద్ర చట్టం తీసుకురావాలని మెడికల్ అసోసియేషన్ కోరింది. మరోవైపు బాధితురాలికి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా కూడా పలు దేశాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News