ఖలిస్తానీ నాయకుడు అమృతపాల్ సింగ్ భార్య ఎవరో తెలుసా?
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది.
దిశ, వెబ్ డెస్క్: ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది. అదే అమృతపాల్ సింగ్. ఈయన పంజాబ్ కేంద్రంగా నడుస్తోన్న వారిస్ పంజాబ్ దే సంఘం అధ్యక్షుడు. సిక్కులకు ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశం కావాలంటూ అమృతపాల్ సింగ్ పోరాటం చేస్తున్నాడు. కాగా అమృత పాల్ సింగ్ ప్రత్యేక దేశం పేరుతో అల్లర్లు సృష్టిస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నాడని పంజాబ్, కేంద్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అరెస్ట్ చేసేందుకు పరారీలో ఉన్న ఆయన కోసం గాలింపు చేపట్టాయి. ఇక తాజాగా ఖలిస్తానీ నాయకుడు అమృతపాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్ ను పోలీసులు విచారణ చేపట్టారు. భర్త ఆచూకీ చెప్పాలంటూ ఆమెను కోరారు. ఈ నేపథ్యంలో అమృతపాల్ సింగ్ భార్య గురించి నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకు ఎవరీ కిరణ్ దీప్ కౌర్?
కిరణ్ దీప్ కౌర్ భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరురాలు. కిరణ్ దీప్ కౌర్ పూర్వీకులు పంజాబ్ లోని జలంధర్ ప్రాంతానికి చెందినవారు. 2023 ఫిబ్రవరిలో అమృతపాల్ సింగ్ తో కిరణ్ దీప్ కౌర్ వివాహం జరిగింది. అమృత పాల్ సింగ్ స్వగ్రామమైన జల్లుపూర్ ఖేరాలోనే వారి వివాహం జరిగింది. ఆమెను పెళ్లి చేసుకున్నాక అమృతపాల్ సింగ్ ఓ ప్రకటన చేశాడు. ఇక నుంచి తాను తన భార్యతో కలిసి పంజాబ్ లోనే ఉండబోతున్నానని, వేరే దేశాల్లో ఉంటున్న పంజాబీలంతా సొంత రాష్ట్రానికి రావాలని పిలుపునిచ్చాడు. తాజాగా లండన్ లోని ఇండియన్ హైకమిషన్ కార్యాలయంపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులకు తెగబడిన నేపథ్యంలో కిరణ్ దీప్ కౌర్ కు చెందిన బంధువుల్లో ఎవరెవరు అమృతపాల్ సింగ్ వెంట ఉన్నారు అనే కోణంలో పోలీసులు ఆరా తీసినట్లు తెలిసంది. అలాగే భర్త అమృతపాల్ సింగ్ ఆర్థిక మూలాల గురించి కూడా ఆమెను అడిగినట్లు సమాచారం.