రాహుల్‌పై అనర్హత వేటు : ఆనాడు ఇందిరాగాంధీపై కూడా.. అసలేం జరిగిందంటే?
రాహుల్ గాంధీని డిస్ క్వాలిఫై చేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ లోక్ సభ సభ్యుడైన రాహుల్ గాంధీని డిస్ క్వాలిఫై చేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశం దేశ వ్యాప్తంగా దూమరం రేపగా ప్రతిపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. 2019 నాటి కేసులో రాహుల్ గాంధీపై సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష కారణంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత వేటు పడింది.
అయితే నాడు ఇందిరాగాంధీపై సైతం ఆరేళ్ల వేటు పడింది. 1975లో ఇలాగే అనర్హతకు ఇందిరా గాంధీ గురయ్యారు. పైగా ఆమె ప్రధానిగా ఉండగానే అనర్హతను ఎదుర్కొన్నారు. అది చివరికి దేశంలో ఎమర్జెన్సీకి దారి తీసింది. 1971లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ భారీ మెజారిటీతో గెలుపొందారు. అనంతరం ప్రధాని పదవి చేపట్టిన ఇందిరాగాంధీ తాను పోటీ చేసిన రాయ్ బరేలీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆమె చేతిలో ఓడిపోయిన రాజ్ నారాయణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీనిని విచారించిన అలహాబాద్ హైకోర్ట్ ఇందిర ఎన్నిక చెల్లదంటూ రాజ్ నారాయణ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఆమెపై ఆరేళ్లపాటు అనర్హత వేటు పడింది. ఇందిర పైకోర్ట్‌కు వెళ్లి అలహాబాద్ హై కోర్టు తీర్పుపై స్టే తెచ్చుకున్నారు. అయితే నాడు ఇందిర అధికారంలో ఉండగా నేడు రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉన్నారు. తాజాగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశం రాజకీయ వర్గాల్లో దూమరం రేపుతున్న నేపథ్యంలో ఆనాటి ఇందిరాగాంధీ అంశం తెరపైకి వచ్చింది.