మోడీని ఉద్దేశించే మాట్లాడారా?.. అమిత్ షా పదవీ విరమణ వ్యాఖ్యలపై చిదంబరం కామెంట్స్
77 ఏళ్ల వయసున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాజకీయాలకు పదవీ విరమణ చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు.
దిశ, నేషనల్ బ్యూరో: 77 ఏళ్ల వయసున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాజకీయాలకు పదవీ విరమణ చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. 73 ఏళ్ల ఏడు నెలల వయసున్న ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించే ఈ మాటలు మాట్లాడారా అని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘నవీన్ పట్నాయక్ వృద్ధాప్యం కారణంగా పదవీ విరమణ చేయాలని అమిత్ షా చెప్పారు. అయితే 73ఏళ్ల నరేంద్ర మోడీకి కూడా సూచన ఇచ్చినట్టేనా. ఒక వేళ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అమిత్ షానే ప్రధాని కావొచ్చు’ అని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే అమిత్ షా ప్రతిపక్ష నేతగా కూర్చుంటారని అనిపిస్తోందని తెలిపారు. కాగా, 2025లో మోడీకి 75 ఏళ్లు నిండిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని, తన వారసుడిగా అమిత్ షా కోసమే మోడీ ఓట్లు అడుగుతున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిదంబరం వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే విపక్ష నేతల ఆరోపణలను మోడీ తోసిపుచ్చారు.