Dibrugarh Express derailment: అసోం రైలు ప్రమాదం.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదస్థలిలో సహాయకచర్యలు పూర్తయ్యాయి.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదస్థలిలో సహాయకచర్యలు పూర్తయ్యాయి. మొత్తం 600 మంది ప్రయాణికులను ప్రత్యేక రైలులో అసోంకు పంపారు. గోండా-గోరఖ్‌పూర్ సెక్షన్ మోతీగంజ్, ఝులామీ స్టేషన్ల మధ్య గురువారం చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ప్రమాదంలో ఒకరు స్పాట్ లో చనిపోగా.. మిగతా ముగ్గురు చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. బుధవారం అర్ధరాత్రి పంజాబ్‌లోని చండీగఢ్ నుంచి అసోంలోని దిబ్రూగఢ్‌కు బయల్దేరింది. యూపీ చేరాక.. గురువారం మధ్యాహ్నం ఝులాహీ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. మొత్తం 23 బోగీలకు గాను 5 ఏసీ బోగీలు సహా 8 బోగీలు పట్టాలు తప్పాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయకచర్యలుచేపట్టారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఈ ఘటనపై ఆరా తీశారు. ఈ మార్గంలోని 13 రైళ్లను దారి మళ్లించారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపింది. దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.