బీజేపీ-జేడీఎస్ డీల్ ఖరారు.. 3 స్థానాలో దేవగౌడ పార్టీ పోటీ

లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయాలు మారుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో జనతాదళ్(సెక్యూలర్) పార్టీ పొత్తు పెట్టుకుంది.

Update: 2024-03-23 13:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయాలు మారుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో జనతాదళ్(సెక్యూలర్) పార్టీ పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తులో భాగంగానే కన్నడ నాట జేడీ(ఎస్) మూడు స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తెలిపారు. ప్రధాని మోడీ అభివృద్ధి దార్శనికతను బలోపేతం చేసేందుకు బీజేపీ, జేడీ(ఎస్) కలిసి పనిచేస్తాయన్న నమ్మకం ఉందన్నారు.

ఇకపోతే ప్రజ్వల్ ప్రస్తుతం హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. అక్కడ్నుంచే బీజేపీ- జేడీ(ఎస్) కూటమి అభ్యర్థిగా మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ.. జేడీ(ఎస్) మాత్రం అభ్యర్థుల జాబితాను ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ స్టేట్ చీఫ్ హెచ్‌డీ కుమారస్వామి బరిలోకి దిగుతారని జేడీ(ఎస్) సీనియర్ నేత సీఎస్ పుట్టరాజు గతంలోనే చెప్పారు.

కాగా, మొత్తం 28 నియోజకవర్గాలున్న కర్ణాటకలో వచ్చే ఎన్నికల కోసం బీజేపీ 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. మిగిలిన ఐదు స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తారు. కాంగ్రెస్ 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కర్ణాటకలో ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో రెండు దశల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

కర్ణాటకలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాలకు గానూ 25 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి కూడా విజయం సాధించారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, జేడీ(ఎస్)లు ఒక్కో సీటును దక్కించుకున్నాయి.


Similar News