అహ్మదాబాద్: ప్రధాని మోడీ డిగ్రీ వివరాలు వెల్లడించాలని కోరిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌కు షాక్ తగిలింది. మోడీ విద్యార్హత వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని, ఇలాంటివి అడిగినందుకు కేజ్రివాల్ కు రూ.25,000 జరిమానా విధించింది. నాలుగు వారాల్లో గుజరాత్ రాష్ట్ర న్యాయసేవల సంస్థలో డబ్బులు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలపై కేజ్రివాట్ ఘాటుగా స్పందించారు. తమ ప్రధాని ఎంత విద్యావంతుడో తెలుసుకునే హక్కు దేశానికి లేదా అని ప్రశ్నించారు. డిగ్రీ చూడమని అడిగిన వ్యక్తికి జరిమానా విధిస్తార ఏం జరుగుతుందని ట్వీట్ చేశారు. చదువుకోని లేదా అంతగా చదువుకోని ప్రధాని దేశానికి ప్రమాదకరమని అన్నారు.
2016లో సమాచార హక్కు అభ్యర్థనపై స్పందించిన కేంద్ర సమాచార కమిషన్, ప్రధాని మోడీ గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీలకు పీఎంవోతో పాటు గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీలను ఆదేశించింది. ఈ క్రమంలో మోడీ డిగ్రీ వివరాలను కేజ్రివాల్‌కు వెల్లడించాలన్న సమాచార కమీషనర్ ఆదేశాలను సవాల్ చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ ‘ప్రజాస్వామ్యంలో, పదవిలో ఉన్న వ్యక్తి డాక్టరేట్ లేదా నిరక్షరాస్యుడు అనే తేడా ఉండదు. దీనిలో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదు. ఆ వ్యక్తి గోప్యతపై ప్రభావం పడుతుంది’ అని అన్నారు. కాగా, ఎలక్షన్స్‌లో సమర్పించిన డాక్యుమెంట్ల ప్రకారం ప్రధాని 1978లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.