ప్రతి నెలా మహిళల ఖాతాల్లో రూ.8,500 జమ: రాహుల్ గాంధీ హామీ
దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని, అలాగే మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.8,500 జమ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీఇచ్చారు.
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని, అలాగే మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.8,500 జమ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీఇచ్చారు. బిహార్‌లోని భక్తియార్‌పూర్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. మోడీ ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ ప్రధాని కాలేరని స్పష్టం చేశారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అగ్నిపథ్ రద్దు అవుతుందని వెల్లడించారు. మహిళలకు ఆర్థిక సాయం అందించడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితిలో మార్పులు వస్తాయని తెలిపారు. నన్ను దేవుడే పంపించాడంటూ ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ సెటైర్లు వేశారు. జూన్ 4 తర్వాత, అవినీతి గురించి ఈడీ మోడీని అడిగితే, నాకేమీ తెలియదు.. నన్ను పంపింది దేవుడే అని చెబుతారా అని ప్రశ్నించారు. దేశంలోని యువతకు ఉపాధి కల్పించడంలో మోడీ విఫలమయ్యారని ఆరోపించారు.