‘మోడీ - షా సర్కార్’ అంటూ.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : ‘మోడీ - షా సర్కారు’ మళ్లీ వస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతమై పోతుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.
దిశ, నేషనల్ బ్యూరో : ‘మోడీ - షా సర్కారు’ మళ్లీ వస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతమై పోతుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఈసారి కూడా వాళ్లే గెలిస్తే దేశ రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తారని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని భావించే వారంతా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఖర్గే పిలుపునిచ్చారు. సాత్నా లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ స్థానం నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధార్థ్ కుష్వాహాకు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఖర్గే ప్రసంగించారు. ‘‘ప్రధాని మోడీ అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం మోడీ కనీసం బీజేపీ పేరును కూడా వాడటం లేదు. ‘మోడీ కి గ్యారంటీ’ అంటూ వ్యక్తిగత ప్రచారానికి ప్రయారిటీ ఇస్తున్నారు’’ అని ఆయన విమర్శించారు.
ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు పడ్డాయా ?
‘‘ప్రధాని అయితే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలు ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు చొప్పున పంపిణీ చేస్తానని మోడీ చెప్పారు. మీకేమైనా వచ్చిందా ?’’ అని సభకు హాజరైన వారిని వ్యంగ్యంగా ఖర్గే ప్రశ్నించారు. ‘‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయని యువతకు మోడీ హామీ ఇచ్చారు. దేశ యువతకు గత పదేళ్లలో 20 కోట్ల జాబ్స్ వచ్చాయా ? ’’ అని ఆయన ప్రశ్నను సంధించారు. గత పదేళ్లలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయి సామాన్యులు అల్లాడుతున్నారని కాంగ్రెస్ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇద్దరు అమ్మకం దారులు.. ఇద్దరు కొనుగోలుదారులు
‘‘దేశ ప్రజలకు అన్నీ అబద్ధాలే చెప్పిన ప్రధాని మోడీని ‘ఝూథోన్ కా సర్దార్’ అని పిలిస్తే కరెక్టుగా ఉంటుంది’’ అని కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యానించారు. ‘‘దేశంలోని విమానాశ్రయాలు, రోడ్లు, భూమి, ప్రభుత్వ రంగ సంస్థలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వంటి ఆస్తులను ఇద్దరు కొనుగోలుదారులకు ఇద్దరు అమ్మకం దారులు విక్రయిస్తున్నారు. అదానీ, అంబానీలు ఆ ఇద్దరు కొనుగోలుదారులు.. మోడీ, షా ఆ ఇద్దరు అమ్మకందారులు’’ అని ఖర్గే పేర్కొన్నారు. వాస్తవానికి సాత్నాలో జరిగిన ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆయన అస్వస్థతకు గురికావడంతో అకస్మాత్తుగా పర్యటన రద్దయింది. రాహుల్ గాంధీకి బదులుగా ఈ సభకు ఖర్గే హాజరయ్యారు.