లోక్‌సభ ఎన్నికల కోసం ప్రైవేట్ జెట్, హెలికాప్టర్లకు భారీ గిరాకీ
సార్వత్రిక ఎన్నికల కోసం చార్టర్ జెట్‌లు, హెలికాప్టర్లను పెద్ద ఎత్తున వాడుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజలకు ఆకట్టుకునేందుకు తీరిక లేకుండా షెడ్యూల్‌ను సిద్ధం చేసుకున్నారు. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో రాజకీయ పార్టీలు అన్ని రకాల అవకాశాలను అన్వేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల కోసం చార్టర్ జెట్‌లు, హెలికాప్టర్లను పెద్ద ఎత్తున వాడుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి. పరిశ్రమ నిపుణుల అంచనా ప్రకారం, ఈసారి ఎన్నికల సమయంలో చార్టర్ విమానాలు, హెలికాప్టర్ల డిమాండ్ 40 శాతం వరకు పెరగనుంది. హెలికాప్టర్ల ద్వారా తక్కువ సమయంలో గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు సైతం చేరేందుకు సహాయపడతాయి. కాబట్టి విమానాల్లో వెళ్లడం కంటే ప్రచారం కోసం హెలికాప్టలర్లకు ఎక్కువ గిరాకీ కనిపిస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 'సాధరణంగా ప్రైవేట్ జెట్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇదే సమయంలో అందుబాటులో ఉండే చార్టర్ విమానాలు, హెలికాప్టర్లకు రానున్న రోజుల్లో మరింత గిరాకీ ఉండనుందని ' క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ రాజన్ మెహ్రా తెలిపారు.
పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సార్వత్రిక ఎన్నికల సమయంలో కంపెనీలు కొత్త చార్టర్ విమానాలు, హెలికాప్టర్లను లీజుకు తీసుకుంటున్నాయి. దీనివల్ల పరిమిత కాలానికి డిమాండ్‌ను భర్తీ చేయవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. చార్టర్ విమానాలు, హెలికాప్టర్లకు గంట ప్రాతిపదికన ఛార్జీలు ఉంటాయి. చార్టర్ విమానం ధర గంటకు రూ. 4.50 లక్షల నుంచి రూ. 5.25 లక్షల మధ్య ఉంటుంది. హెలికాప్టర్ గంటకు దాదాపు రూ. 1.50 లక్షల వరకు వసూలు చేస్తారు. ఖర్చు పరంగా కంటే సీజన్ కావడం మూలంగా లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రైవేట్ చార్టర్ విమానాలు, హెలికాప్టర్ల డిమాండ్ గత ఎన్నికల కంటే 30-40 శాతం అధికంగా ఉండనుందని బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్(బీఏఓఏ) ఎండీ కెప్టెన్ ఆర్‌కె బాలీ చెప్పారు.
రాజకీయ నాయకులు చిన్న పట్టణాలకు వెళ్లేందుకు హెలికాప్టర్లను ఎంచుకుంటారు. కాబట్టి చార్టర్ విమానాల కంటే హెలికాప్టర్లకు అధిక డిమాండ్ ఉండవచ్చని రాజన్ మెహ్రా తెలిపారు. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) వద్ద ఉన్న 2019-20 పార్టీ వార్షిక ఆడిట్ ప్రకారం, కేంద్రంలో ఆధికారంలో ఉన్న బీజేపీ విమానాలు, హెలికాప్టర్ల కోసం రూ. 250 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అదే సమయంలో ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మొత్తం రూ. 126 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఈసారి ఎన్నికలకు ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
రాజకీయ విశ్లేషకులు ఎన్ భాస్కరరావు దీని గురించి మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఖర్చు దాదాపు రూ. 1.20 లక్షల కోట్లు ఉంటుందన్నారు. ఇందులో ఎన్నికల సంఘం దాదాపు 20 శాతం ఖర్చు చేస్తుందని అంచనా(కొత్త ఈవీఎంల ఖర్చు కాకుండా). కరోనా మహమ్మారి వల్ల చార్టర్ విమానాల అద్దె ధరలు పెద్దగా పెరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు.